Friday, September 28, 2018

తొలి అడుగులు


జీవన విస్తృతి అనంతం, అమోఘం. ఈ అనంతంలో మనిషి మనీషిగా జీవించటం–—వివేక విమర్శలతో, లోతైన అలోచనలతో అర్ధవంతంగా జీవించటం–—ఉత్కృష్టమైన కార్యం. సార్ధకత సాధించటం కూడా!

సక్రమ చిత్తవృత్తులు, బహుజన శ్రేయోభిలాష, బలమైన మనస్సు జీవికి సజీవత్వాన్ని ప్రసాదిస్తాయి. వీటికి అశేష ప్రావీణ్యం, విశేష ప్రయత్నం తోడైతే జీవితపు ప్రమిదలో చైతన్యదీపిక వెలిగినట్టే! ఆ కాంతిపుంజంలో ఎవరి జీవనయానమైనా సార్ధకత సాధించటం తధ్యం.

శాంతిపూర్వక సహాయనిరాకరణోద్యమాన్ని ప్రారంభించి దాదాపు మూడు దశాబ్ధాల పాటు దానిని ఓ విస్తృత రాజకీయ కార్యక్రమంగా ముందుండి నడిపి, ఆనాటి బ్రిటన్ యొక్క అతి పెద్ద కాలనీ అయిన భారతదేశాన్ని పరిపాలనా పీడన నుంచి విముక్తి గావించి, అతిపెద్ద ప్రజాస్వామ్యంగా ఆవిష్కరించిన శ్రీ మోహన్‌దాస్ కరంచంద్ గాంధీగారు అట్టి సార్ధక జీవులలో ఒకరు. బహుశా అగ్రగణ్యుడేమో!

“మొట్టమొదట వాళ్ళు నిన్ను గుర్తించరు. తరువాత నిన్ను చూసి నవ్వుతారు. ఆ తరువాత నీతో పోట్లాడుతారు. అంతిమంగా నువ్వు వాళ్ళను గెలుస్తావు” అన్న మాటలు గాంధీగారు అన్నట్లు కొందరి భావన. అదెంతవరకు నిజమో తెలియదు గానీ, ఈ మాటలు మాత్రం వారి జీవనయానాన్ని ఓ పరిపూర్ణ చిత్రంగా మన కళ్ళ ముందు నిలుపుతాయి.

వీరి జీవితంలో–—వీరి జీవితంలోనే కాదు భారతదేశ చరిత్రలో కూడా, ఆ మాటకొస్తే ప్రపంచ చరిత్రలోనే–—1893వ సంవత్సరం ఒక గొప్ప ‘టర్నింగ్ పాయింట్’. ఆ సంవత్సరంలోనే ఒక ముఖ్యమైన కేసు వాదించటానికై గాంధీగారు సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. ఈ విదేశయాత్రలో గాంధీగారు రానున్న 55 సంవత్సరాలలో తను నడపబోయే ఒక అనూహ్యమైన రాజకీయోద్యమానికి తెరతీయగనున్నారని ఆనాడు ఎవరూ ఎరుగరు.

గాంధీగారు కేవలం న్యాయవాదిగా సౌత్ ఆఫ్రికా వెళ్ళారు. కానీ ఆదేశంలో అడుగిడిన తరువాయి అక్కడి భారతీయ పౌరులను పీడిస్తున్న బలవత్తర సమస్యకు స్పందించి దాని నిర్మూలనార్ధమై సాగించిన నిరసన ఉద్యమానికి నేతగా నిలబడిపొయారు–—తనకు తెలియకుండా ఆ ఉద్యమానికే కేంద్రబిందువుగా నిలిచారు.


దక్షిణాఫ్రికాలో భారతీయులు ఎదుర్కొంటున్న సాంఘీక అవమానాలు–—వర్ణవివక్షత, జాత్యాహంకారం, అణచివేతకు నిరసనగా శాంతియుతపోరాటానికి రూపురేఖలు దిద్ది, సామాన్య ప్రజలు సహితం పాల్గొనటానికి వీలయ్యే కార్యక్రమము రచించి, తమ అమోఘమైన సమ్మోహనాశక్తితో ప్రజలను ఆకర్షించటమే కాక వారిని ఉద్యమబాటలో నిలబెట్టి పౌరహక్కుల పునరుద్ధరణకు సుమారు ఇరవై సంవత్సరాలు అవిశ్రాంత పోరాటాన్ని సాగించారు. “నహి వైరేణ శామ్యం తహకు తశ్చన” (వైరం ద్వారా వైరం శాంతించదు) అన్న సత్యమెరిగిన “మహోన్నత హృదయసంస్కారంతో, అనుమానలకు తావులేని నిజాయతీతో” ఉద్యమ నాయకత్వ బాధ్యతను స్వీకరించి 1893 నుండి 1913 వరకు తనను తాను హింసించుకుంటూ–—నీతిబాహ్యమైన ప్రభుత్వ చట్టాల ప్రతి నిరసనను వాటి ఉల్లంఘన రూపంలో తెలియజేస్తూ, తద్వుల్లంఘనకు చట్టపరంగా ప్రాప్తించే శిక్షను నిర్వికల్పంగా స్వీకరించి అనుభవిస్తూ–—పౌరుల మధ్య ‘సమానత్వ’ సాధనకై కృషి సల్పారు. తమ సృజనాత్మకశక్తితో సహాయనిరాకరణోద్యమానికి రాజకీయ ఆచరణాత్మకతను ఆపాదించి తమ కార్యసాధనకు దానిని ఒక బలమైన పనిముట్టుగా వాడుకున్నారు. అహింస, సత్యం, శీలం, నైతికనిష్ఠ–—ఇవే వీరి ఉద్యమనాయకత్వానికి ఊపిరి. ఈ సునిశ్చితమైన, సుదృఢమైన శక్తితో ఉద్యమాన్ని జయప్రదం చేశారు.

ఈ సౌత్ ఆఫ్రికా కార్యక్రమాలూ, వాటిలో నిబిడీకృతమైన పొలిటికల్ ఫిలాసఫీయే భారతదేశ స్వాతంత్రయం కొరకు గాంధీగారు నిర్వచించిన శాంతియుత సహాయనిరాకరణోద్యమానికి మూలాలు. ఒక్కమాటలో చెప్పాలంటే అది భారతదేశ స్వాతంత్రోద్యమానికే పునాది. అందుకే వీరి సౌత్ ఆఫ్రికా యాత్ర ఓ పెద్ద ‘టర్నింగ్ పాయింట్’. ఇదే వీరిని ‘మ్యాన్ ఆఫ్ డెస్టినీ’గా ఆవిష్కరించింది.

No comments:

Post a Comment