Sunday, June 14, 2020

బోధనే ఓ ఆలాపనగా...


సోక్రటీస్ దృష్టిలో బోధన మంత్రసానితనం లాంటిది. ఎలా అయితే మంత్రసాని తన చేతినైపుణ్యంతో గర్భిణీస్త్రీకి ఈలోకానికి కొత్తప్రాణిని ప్రసాదించటానికి సహకరిస్తుందో, అదే రీతిలో ఉపాధ్యాయుడు తన బోధనానైపుణ్యంతో విద్యార్థి మనస్సు కొత్త ఆలోచనలను, జ్ఞానాన్ని వాటి అర్ధాన్ని అంది పుచ్చుకోవటానికి సహకరిస్తాడు.

అర్థాత్, ఏ ఉపాధ్యాయుడూ జ్ఞానాన్ని జడత్వంగా వున్న విద్యార్థి మనస్సులోకి జొప్పించజాలడు; విద్యార్థే ఉపాధ్యాయుడు సహకారంతో జ్ఞానాన్ని కనుగొంటూ క్రమేణా తనసొంతం చేసుకుంటాడు.

సోక్రటీస్ ప్రశిష్యుల్లో ఒకరైన అరిస్టాటిల్ ఉపాధ్యాయ వృత్తికి తన నిర్వచనాల ద్వారా ఇంకొంచెం స్పష్టత కల్పించాడు. బోధన, వ్యవసాయంలాగా ఒక సహకారాత్మకమైన కళ. ఎలా అయితే మొక్కలు రైతు సహాయం లేకుండా కూడా మొలిచి, పెద్దవై, పూలు, కాయలు ఇస్తాయో, అలాగే మనం కూడా ఎన్నో విషయాలు మనంతట మనంగా తెలుసుకోగలం. కానీ అవే మొక్కలు రైతుపోషణలో ఏపుగా పెరిగి, అధిక ఫలసాయం అందిస్తాయి. అలాగే ఉపాధ్యాయుని బోధనలో విద్యార్థి జ్ఞానాన్ని సులువుగా, ప్రభావవంతంగా, సాధికారికంగా సొంతం చేసుకోగలుగుతాడు.

బోధన రెండు మనస్సులకు సంబంధించినది. ఉపాధ్యాయుడు మాట్లాడే యంత్రం కాదు. అతను ఎవరో అజ్ఞాతంలో వున్న వ్యక్తికి తన పాఠాన్ని ప్రసారం చెయ్యడు. తన బోధనను సంభాషణలతో సాగిస్తాడు. ఇది రెండు వైపులనుంచీ జరుగుతుంది. ఇలా ఉపాధ్యాయుడు - విద్యార్థి మధ్య సాగే సంభాషణ చేతనాచేతన స్థితికి అతీతంగా జరుగుతూంటుంది. దృఢమైన, స్నేహపూర్వకమైన సంబంధమున్న గురుశిష్యుల మధ్య ఎక్కువశాతం జ్ఞానప్రసరణ ఇలాగే సాగుతుంది.

బోధన అనేది రెండువైపులనుంచీ సాగే ప్రక్రియ. గురువు దీక్షనిస్తాడు. విద్యార్థి స్వీకరిస్తాడు. అలా అని విద్యార్థి తనను తాను గురువుకు బందీని చేసుకోడు. పిల్లలు తల్లిదండ్రుల సహాయ, సహకారాలతో ఎలా అయితే ఎదుగుతారో, అలాగే విద్యార్థులు గురువు సహకారంతో జ్ఞానవంతులుగా ఎదుగుతారు.

"నిజం అనేది ఏమిటి? దానినెలా గ్రహించటం? దాని విలువ కట్టటమెలా? అది ఔనో కాదో అని నిర్థారించుకోటం ఎలా?" అన్న ప్రశ్నలకు ఉపాధ్యాయుడు విద్యార్థికి సమాధానాలు వెతుక్కునే దారి చూపిస్తాడు.

అంతేకాని, "ఇదీ సిద్ధాంతం", "ఇది ఇంతే", "దీన్ని వల్లె వేసుకో ... పదిసార్లు చదివి గుర్తు పెట్టుకో అని విద్యార్థి ఎదుగుదలకోరే ఉపాధ్యాయుడెవరూ చెప్పడు. తన వృత్తి ఎరిగిన ఉపాధ్యాయుడు విద్యార్ధికి ఆలోచించే విధానం, ఆలోచన ద్వారా కొత్త విషయాలు గ్రహించే పద్ధతి నేర్పుతాడు. తెలివైన విద్యార్థిలోని జిజ్ఞాసను, అతని వాదనలను, అలోచనలను గౌరవించి అందలి తప్పొప్పుల గురించి విశ్లేషణాత్మకంగా విశదీకరించి, విద్యార్థిని సన్మార్గంలో ఎదగటానికి ప్రోత్సహిస్తాడు.

అప్పుడే బోధన అనే ప్రక్రియ, అరిస్టాటిల్ అన్నట్లు సహకారాత్మకమైన కళగా వెలుగొందగలదు. అప్పుడే ఈ కళ విద్యార్థులను తమనుతాము జ్ఞానవంతులుగా తీర్చిదిద్దుకోగల సమర్థులుగా చేస్తుంది. ఈ భావమెరిగిన ఉపాధ్యాయుడు దీనినొక ఉదాత్తమైన కళగా ఆచరిస్తాడు, ఆదరిస్తాడు. అప్పుడే అతని వృత్తి సమాజానికి ఉపయోగపడగలదు.


బోధన: రకరకాలు?
రాధిక తన చిన్నకొడుకు, బస్సు దిగి కాళ్ళీడ్చుకుంటూ వచ్చి, బ్యాక్ ప్యాక్ డైనింగ్ టేబుల్ మీద పడేస్తుంటే, కిచెన్ లో నుంచే అడిగింది: ‘ఏమ్మా ఎలా ఉంది స్కూల్లో ఫస్టుడే?’
వూఁ … ! హాఁ … !”
"ఏంటి? నసుగుతున్నావ్? బాలేదా?"
"స్కూల్ బానే వుంది. ఆఁ ..."
"మరేంటి?"
నీరసంగా నవ్వుతూ... " ఆఁ ... మిస్ ఎవరో...
బోర్డు దగ్గర... మాట్లాడుతూనే ఉందిరోజంతా" అని గొణిగాడు.
                                               

బోధన: రకరకాలు?
మొదటిరోజు స్కూల్లోనుంచి, “మమ్మీ! మమ్మీ…!అంటూ పెద్దగా నవ్వుతూ పరిగెత్తుకొ చ్చాడు వాళ్ళ అయిదేళ్ళ రౌడీవెధవ మాలతి దగ్గరకు.
మెల్లగాపడిపోతావురా వెధవా!” అంటూ మాలతి ముందుకు పరుగెత్తుతుంది.
మమ్మీ! మమ్మీ!”
మంచి హుషారుగా ఉన్నావ్! ఏమైంది క్లాసులో?”
మిస్!... మిస్!”
ఆఁమిస్! ఏమైంది వొక టిచ్చిందా!”
హుషారుగా ళ్లు ఇంతవిచేసి, చేతులూపుతూ, నోరంతా తె రిచి, “నేను… రేపుకూడా క్లాస్ కి రావాలంట!
అంటూ ఎగిరి మమ్మీని వాటేసుకున్నాడు.

No comments:

Post a Comment