Monday, November 13, 2023

ఏనుగుల వీరాస్వామి (Enugula Veeraswamy)

 


“తెలుగుదేశము చేసికొన్న అదృష్టము చేత ఆంగ్లభాష నభ్యసించి ఆంగ్లేయుల గౌరవమును గడించి... మన ప్రాచీన భారతీయ వైదిక మత సంప్రదాయములను చెక్కుచెదరక నిల్పుచు ఇటు రాజకీయముగా అటు సాంఘికముగా తమ జీవితమును ధన్యము చేసుకున్న ఆంధ్ర మహాపురుషులు...” యేనుగుల వీరాస్వామి (1780-1836).

వీధిబడిలో చదువుకొని స్వయంకృషితో అతిపిన్నవయసులోనే ఇంగ్లీషులో ధారాళమైన ప్రజ్ఞ సంపాదించి, తిరునల్వేలి కలెక్టర్ కచేరీలో ‘ఇంటర్ ప్రిటర్’గాను, ట్రాన్స్ లేటర్ గాను ఉద్యోగం సంపాదించి, కార్యనిర్వహణలో మన్ననలు పొంది, క్రమేపీ తెల్లదొరలతో సమానంగా కచేరీ పత్రాలు వ్రాయగల ప్రావీణ్యతను సంపాదించి, మద్రాసు సుప్రీంకోర్టులో హెడ్ ఇంటర్ ప్రిటర్ గా ఎదిగి, న్యాయమూర్తుల పొగడ్తలకందనంత యోగ్యతతో బాధ్యతలను నిర్వహించి, తమ 55వ యేట, 1835లో పదవీ విరమణ చేశారు.

వీరాస్వామిగారు వస్తుతః సంఘసంస్కరణాభిలాషి. పదిమంది మంచిని కోరేవారు. ఈయన తెలుగు, తమిళం మరియు సంస్కృత భాషలలో దిట్ట. తన సాటి ప్రజలలో విజ్ఞానాన్ని, చైతన్యాన్ని అభివృద్ధిపరచటానికి మద్రాసులోని పురప్రముఖులతో ‘హిందూ లిటరరీ సొసైటీ' అనే ప్రజాసంఘాన్ని స్థాపించారు. ఇందులో విదేశీయులను కూడా కరస్పాండెంట్ మెంబర్లుగా చేర్చుకోవటం ఈ సంస్థ సౌమ్యతకు, ముందుచూపుకు నిదర్శనం. ఈ సంస్థ ఏర్పాటు చేసిన జార్జ్ నార్టన్ గారి ప్రసంగాలు విన్న ప్రజలు చైతన్యవంతులై ఇంగ్లీషు చదువులు కావాలని 70 వేల సంతకాలతో ప్రభుత్వం వారిని కోరడం అందుకు వారు అంగీకరించటం వీరాస్వామిగారి కార్యదీక్షకు నిదర్శనం.

1833లో వచ్చిన ఉప్పెనగాలివల్ల పాడిపంటలు నాశనమై గుంటూరు జిల్లా కరువు కాటకాలకు గురైనది. రాజధానియైన మద్రాసులోనైనా అన్నం దొరుకుతుందేమోనన్న ఆశతో నగరానికి చేరుకున్న ప్రజలకు సర్కారువారు అనేక ప్రాంతాల్లో గంజి దొడ్లను స్థాపించి అన్నదానం చేయనారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని పర్యవేక్షించటానికి ధర్మకర్తగా నియమింపబడ్డ వీరాస్వామిగారు పేదలకు సకాలంలో అన్నాన్ని అందజేయడంలో తన శక్తివంచన లేకుండా శ్రమించి ఇతరులకు స్ఫూర్తిదాయకంగా నిలిచారు.

వీరాస్వామిగారు ప్రజాసేవా కార్యక్రమాలు చేపట్టడంలో అమితోత్సాహికులు. మద్రాసు పట్టణంలో ప్రసిద్ధ వర్తకులైన పచ్చయ్యప్ప ఏర్పాటు చేసిపోయిన ధర్మనిధిని తెల్లదొరల సహకారంతో వెలికితీశారు. దాని సద్వినియోగం కొరకు మద్రాసు సుప్రీంకోర్టులో ప్రణాళిక తయారు చేయించి దాని అంతర్భాగంగా పచ్చయప్ప పేరుమీద కళాశాల స్థాపించి హిందూ సమాజంలోని పేద విద్యార్థులకు ఉచిత విద్యనందింప చేశారు. ఈ విధంగా తమకు సమాజంలోని ఉన్నతస్థానంలో ఉన్న ప్రగతిశీలురలతో తమకు గల సాన్నిహిత్యాన్ని వీరాస్వామిగారు తమ వంతు ప్రజాసేవ కొరకు సద్వినియోగం గావించారు.

వీటన్నిటికి మించి యేనుగుల వీరాస్వామిగారి పేరు విన్నంతనే తెలుగువారికి గుర్తుకు వచ్చేది వీరి 'కాశీయాత్ర, దాని చరిత్ర '. తమ కాశీ ప్రయాణానికై ఒక నిర్ధుష్టమైన ప్రణాళికను ముందస్తుగానే రచించుకొని ఇంగ్లీషు దొరల సహాయసహకారాలతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బంధుమిత్ర సపరివారముగా ఈ సుదీర్ఘమైన యాత్రను సాఫీగా పూర్తిచేయటమేకాక, తమ యాత్రావిశేషాలను గ్రంథస్థం చేయటం వీరాస్వామిగారి ప్రజ్ఞకు  నిదర్శనం.

ఈ యాత్రలో వీరాస్వామిగారు ప్రజల జీవన విధానాన్ని శ్రద్ధగా పరిశీలించి, వివిధ ప్రాంతాలలోని ప్రజల ఆచార వ్యవహారాలు, వేషధారణ, ధరించిన ఆభరణాలు, ఆహార విహారాదులు మున్నగు విషయాలను విశ్లేషణాత్మకంగా వర్ణిస్తూ ఉత్తరాల ద్వారా మద్రాసులోని తన మిత్రుడు శ్రీనివాస్ పిళ్లైకు వ్రాసి పంపించేవారు. దీనితోపాటు దేశంలో బ్రిటీష్ వారి పరిపాలనా విధానం, బ్రిటీష్ పాలనలో లేని సంస్థానాలలోని పాలనావిధానం, ప్రజల ఆలనా పాలనలు, సుంకాలు, వాటి వసూలు, రక్షణ వ్యవస్థ, ఇత్యాదుల వివరాలు ఉత్తరాలలో పొందుపరిచేవారు. వివిధ ప్రాంతాలలోని గృహనిర్మాణశైలిని కూడా వివరించారు. అలాగే వివిధ ప్రాంతాల మధ్య దూరం, ప్రయాణ కాలం, ఆయా ప్రాంతాలలో దేవాలయాల నిర్వహణ, పూజావిధానాలు, పండాల ప్రవర్తన గురించి కూడా వివరంగా విషయసేకరణ చేసి ముందుతరాల వారికి ఉపయుక్తంగా వర్ణించారు

‘కాశీయాత్రా చరిత్ర’ గా ముద్రితమైన వీరి 'యాత్రా' విశేషాలు ఆనాటి సామాజిక, రాజకీయ చరిత్రకు (1830-31) అద్దం పట్టాయి. విచిత్రమేమంటే, ఈ యాత్రా చరిత్ర వ్రాసే కాలం నాటికి తెలుగు సాహిత్యం ‘మిడీవల్’ ఆచారం నుండి ఇంకా బయట పడలేదు. మరియు కొత్త తరహా రచనా పోకడలు తెలుగు సాహిత్యంలో ఇంకా ఉద్భవించలేదు. అయినా ఈ తొట్టతొలి 'ట్రావెలోగ్' కి ప్రాప్తించినంత ఆదరణ, గౌరవం మరి ఏ యితర తెలుగు రచయితకు దక్కలేదు.

ఈ 'ట్రావెలోగ్' చదువుతుంటే, మనసులో కొన్ని ప్రశ్నలు మెదులుతున్నాయి: వీరాస్వామిగారు సందర్శించిన ప్రాంతాలలోని ఈనాటి జనజీవనం ఎలా ఉంది? ఆచార వ్యవహారాలు ఏ విధంగా మారాయి? మానవ సంబంధాలు ఏ రీతిలో సాగుతున్నాయి? పట్టణ రూపురేఖలు ఎలా మారాయి? ఈనాటి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి?

ఇలాంటి ప్రశ్నలకు సమాధానం కొరకు ఎవరయినా వీరాస్వామిగారి యాత్రామార్గాన్ని అనుసరించి మరలా ప్రయాణించి “సోషియో-పొలిటికొ-ఎకనామిక్-ఆంత్రోపోలాజికల్” సర్వే లాంటిది చేపట్టీ,  ఆ వివరాలను గ్రంథస్థం చేస్తే బాగుంటుందనిపిస్తుంది.

19వ శతాబ్ధపు ప్రథమార్ధంలో సాటి ప్రజల మనుగడకు తమవంతు సేవచేసిన తెలుగువారిలో ప్రముఖులైన వీరాస్వామిగారి జీవితచరిత్ర చదవతగినది.

 

No comments:

Post a Comment