Tuesday, March 14, 2017

Dr Mythili Abbaraju's 'Nimagna' —ఆ అక్షర రమ్యతలో నిమగ్నమై...


ఓ సాయంత్రం ఆఫీసు నుంచి ఇంట్లోకి వస్తుంటే టీపాయ్ మీద పార్శిల్ కనిపించింది. అబ్బా! మళ్ళీ రామయ్యగారు ఏదో పుస్తకం పంపించినట్టున్నారు. మరీ ఋణగ్రస్తుడ్ని చేస్తున్నారు అనుకుంటూ పార్శిల్ విప్పగానే అందంగా మెరిసిన పుస్తకం ... తెల్లటి కాన్వాస్. కుడివైపుగా పైన తీగలాంటి నల్లటి అక్షరాలు. ‘నిమగ్న’ క్రిందగా డా. మైథిలి అబ్బరాజు అన్న గుండ్రటి అక్షరాలు మెరూన్ రంగులో మెరుస్తున్నాయి. వీటి మధ్య మందారపువ్వుల్లాంటివి రెండు ... అక్కడక్కడా సగం సగం కనిపిస్తున్న ఆకులు. చూడగానే ఆకట్టుకునే కవరు పేజి. ఉండబట్టలేక పేజీలు తిప్పగానే పుస్తకం పైన ఎంత అందంగా ఉందో లోపల కూడా అంతే అందంగా కనిపించింది. సహృదయ సంస్మరణతో మొదలై మంత్రపుష్పంతో ముగిసిన ఆ కూర్పు, ఆ విషయానుక్రమణ రచయితను గొప్ప ('aesthete') ‘ఎస్థట్’ గా కళ్ళముందు నిలబెట్టాయి.

సరళమైన శైలి. సహజమైన ఒరవడి. సున్నితమైన సుందరభావాలు: “వెన్నెట్లో రాత్రివేళ చుక్కల్లాగా ఊగే [పున్నాగ] పువ్వులు”; వర్ణనాత్మక వచన రచనాశైలి: “పుట్టుకతో సోకిన పిచ్చి పొగడపూల గాలికి వెర్రి కలలు కనేప్పుడు, చాలా చిన్నప్పుడు – బహుశా ఒక వేసవి మధ్యాహ్నం రేడియోలో నించి ‘పురూరవ’ ఒక్కసారి ఇల్లంతా వానగాలి వీచింది. జలతరంగిణి వంటి మాటలు. అది గంధర్వలోకమని మాత్రం తెలిసింది నా నిద్రకళ్ళకి” చదువుతుంటే మా ఊరు జిఎల్ఎల్ఎ లైబ్రరీలో కూర్చుని అలనాటి పుస్తకాలు, ఏ ‘మోహనవంశి’ లేక ‘అరుణ’ చదువుతున్న రోజులు గుర్తొచ్చాయి.

కాళిదాసు కవిత్వం ఎంత ప్రసన్నంగా, సుకుమారంగా, సంప్రదాయబద్ధంగా ఉంటుందో, అంతే సలలితంగా, సమ్మోహనంగా సాగుతుంది ఈ రచయిత్రిగారి శాకుంతలం నాటక విశ్లేషణ కూడా. కాళిదాసు కవిత్వంలోని ప్రత్యేకతను, ముఖ్యంగా సర్వాంగసుందరంగా సాగే వారి ‘శయ్య’ను బహుచక్కగా వివరించారు. దుష్యంతుడు, శకుంతల వ్యక్తిత్వాలను వివరిస్తూ వాత్సల్యభరితమైన కాళిదాసు హృదయ సౌందర్యాన్ని చక్కగా ఆవిష్కరించారు. ఈ ఆవిష్కరణలో మధ్యమధ్య రచయిత్రిగారి సుకుమారభావాలూ ప్రతిబింబిస్తాయి. ఉదాహరణకు అరుదైన శకుంతల అందాన్ని వర్ణిస్తున్న శ్లోకం – “అనాఘ్రాతం పుష్పం ... సముపస్థాస్యతి విధి:” – ప్రస్తావిస్తూ ఈ శ్లోకంలోని మూడవ పంక్తిని – “అఖండపుణ్యానాం ఫలమివచ తద్రూపమనఘం” – ఆ నిష్కల్మషమైన రూపం [నా] అఖండపుణ్యఫలం – చదువుతున్నపుడల్లా కళ్ళు చెమ్మగిల్లుతున్నాయంటారు. “ఆ మాటలు భార్యగురించి ప్రతి పురుషుడు భావించగల దానికి పరమావధి” అన్న వారి భావనే కళ్ళు చెమ్మగిల్లటానికి కారణం అని వేరే చెప్పనక్కరలేదు. ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు మా మాష్టారి మాటొకటి గుర్తుకొచ్చింది. నియమనిష్ఠలతో కృశించి కేశాలంకరణ కూడా లేకుండా విరహవ్రతంలో మిగిలిపోయిన శకుంతలను చూసి “... త్వయా ప్రతి ప్రత్యభిజ్ఞాతం ఆత్మానాం పశ్యామి” – నీచేత గుర్తింపబడటం నాకు ఎంతో శుభదాయకంగా భావిస్తున్నాను అన్న దుష్యంతుడి అభినందనకు మించిన ప్రశంస సాహిత్య చరిత్రలో ఏ భర్త భార్యకు ఇచ్చినట్లు కానరాదు అంటారు. ముచ్చటించదగిన మరొక విషయం: డాక్టర్ గారు కాళిదాసు నాటకరచనా విశిష్థతను, కవిత్వ విలాసాన్ని వివరించటమే కాక ఈ ప్రత్యేకతలను తమ వ్యాఖ్యానం ద్వారా బహుముఖంగా వ్యాపింపచేసిన మల్లినాధ సూరి సంస్మరణను అనుబంధంగా జతపరచుట ఎంతో ముదావహం.

ఉత్తర రామాయణం అంటే ఉన్న కోపం కుందమాల చదివితే తగ్గిందంటారు డాక్టర్ గారు. చల్లటి ఉపశమనాన్ని కూడా ప్రసాదించిందట. కాదా మరి! దిజ్ఞాగుడు అంతటి ఆర్తితో సీత పాత్రను మధురహృదయ, శుద్ధశీల, త్యాగమయి సీతగా అంతకు మించిన అభిమానోజ్జ్వల సీతగా తీర్చిదిద్దెను కదా! సంస్కృత వాఙ్మయంలో ఏ కవీ సాహసించని రీతిలో సీత చేత రమ్యచరితుడైన రాముణ్ణి, తన భర్తని ‘నిరనిక్రోశ ‘, ‘ప్రజాపవాదభీరు’, ‘ఓయీ నిష్ఠురుడా’ అని సంబోధింపచేస్తాడు. అంతేకాదు, ఈ దిజ్ఞాగుడి సీత “... సీతాయ అపినామ ఏవం ...” – సీత పేరే ఇటువంటి కళంకంతో జోడించగలిగినపుడు స్త్రీజాతి గతేమి? అని ప్రశ్నించగలిగిన ధీరవనిత. ఇలాంటి సార్వజనీకరణ భావనలను చదువుతున్నప్పుడు ఉపశమనం కలగదా మరి! ఈ రాగరంజితమైన కుందమాలను మనకు వివరించిన డాక్టర్ గారు ఆరవ అంకంలోని ఒక ఘటనను ఉదహరిస్తూ ఓ ముచ్చటైన భావన వెల్లడిస్తారు. మూర్ఛ నుంచి తేరుకున్న కుశలవులు తండ్రికి ప్రణామం చేసి లేచి నిలబడి గుడ్లప్పగించి రాముడిని చూస్తుంటారు. వారిని ప్రక్కకు తీసి సీత అడుగుతుంది “క ఏష: యో యువాభ్యా మేవం పేక్షిత:” – ఎవరురా ఆయన? అలా చూస్తున్నారు? ఈ సంఘటనపై వ్యాఖ్యానిస్తూ, తమకు చాలా ప్రియమైన వారిని బిడ్డలు చూస్తుంటే అది ఎవరో, వారి నోటనే చెప్పించే ముచ్చట మన ఇళ్ళలో జరిగే రీతిలోనే సీత కూడా లవకుశుల చేత ఆయన ఎవరో చెప్పించుకుని వినేందుకు, విని ఆనందించాలన్న కోరికే ఈ ప్రశ్నకు మూలం అంటారు. సంప్రదాయబద్ధమైన, స్త్రీ సహజమైన మనస్సుతో గాక కొంచెం ఆవలికి జరిగి ఈ దృశ్యాన్ని చూసినట్లైతే బహుశా డాక్టర్ గారు మరోలా వ్యాఖ్యానించేవారేమో! ఏది ఏమైనా, కుందమాలను హృదయాహ్లాదినిగా భావించిన రచయిత్రి ఈ వ్యాసాన్ని మాత్రం వేగవంతంగా ముగించారేమో అనిపించింది. లేక 40 పేజీల శాకుంతలం వ్యాసం చదివిన వెంటనే ఈ వ్యాసం చదవటం వల్ల నాకలా అనిపించిందో! లేక శాకుంతలం మీద చూపిన మమకారానికి ఈ వ్యాసం నోచుకోలేదేమో!

అత్యుత్తమ సాహిత్యద్రష్టగా, సాహిత్యస్రష్టగా ప్రసిద్ధి గాంచిన విశ్వనాథ సత్యనారాయణగారన్న రచయితకు ఎంతో ఆరాధనా, భక్తి. ఆయన సాహిత్య శోభను, వ్యక్తిత్వ విశిష్ఠతను మనకు విభిన్నకోణాల నుంచి ప్రజెంట్ చేస్తున్న వ్యాసానికి ‘నా విశ్వనాథ’ అన్న శీర్షిక ఎన్నుకోవటంలోనే ఈ భావన ప్రస్ఫుటం. ద్వేషించటం ఎరుగని విశ్వనాథగారే నర్తనశాలలాంటి నాటకం రాయగలరన్న ప్రస్తావన లాజికల్‌గా మనముందుంచారు. విభిన్న ప్రక్రియలలో ప్రతిబింబించిన వారి విజ్ఞతను, దార్శికతను, ఉపాసనను పరిచయం చేస్తూ విశ్వనాథను ‘యోగియైన అద్వైతి’గా నిర్వచించారు.

సౌందర్యాన్ని ఓ భక్తుడిలా ఆరాధించిన  (Keats) కీట్స్అంటే ఈ రచయితకు ఎంత మక్కువో! కానిచో వీరి ‘రససిద్ధుని ప్రస్థానం’ ఓ గంధర్వగానంలాగా సాగుండకపోను. విలక్షణ ప్రతిభ, తీవ్ర భావనా ప్రవళత, రసాత్మకతతో సమ్మిళితమైన దృష్టితో కీట్ ఇంగ్లీషులో చెప్పిన వినసొంపైన ఊసులు, బాసలు మనకు తెలుగులో తిరిగి చెప్పి – ‘నా శ్వాసను సుతిమెత్తగా గాలిలో కలిపేయమని బ్రతిమిలాడుతున్నాను చావుని, తేలికగా తీసుకుపొమ్మని’ – అనిర్వచనీయమైన ఆనందాన్ని ప్రసాదించారు. భావుక హృదయాలను  ఉయ్యాలలూగించారు. ఇదే రొమాంటిసిజంతో, భావ స్పష్టతతో మనకు జేన్ ఆస్టిన్ , అగాథా క్రిస్టీ, రాబర్ట్ ఫ్రాస్ట్‌ల రచనలనే గాక మరెందరో తెలుగు రచయితల పుస్తకాలను సైతం మనకు పరిచయం చేశారు. లోకంలో అందరి నవ్వు ఒకటిలానే ఉంటుంది. కాని ఏ ఇద్దరి ఏడుపూ ఒకటిలా ఉండదన్న సాధారణీకరణకు చక్కటి వ్యాఖ్యానంలా ఫ్రాస్ట్ ‘భూస్థాపితం’ కవితను విశ్లేషించారు. “పోనీలే, అనాలనుకున్నవి అన్నీ అనేశావుగా, కొంచెం తేలికపడి ఉంటావు. ఏడుస్తూనే ఉన్నావు. వెళ్ళకు ఎక్కడికి” అన్న భర్త మాటలకి, “నీకలాగే ఉంటుంది. అంతటితో తీరుతుందా ... నీకేం చెప్పలేనసలు – ఉండలేను, వెళతాను” అన్న భార్య సమాధానం విన్న ఏ పాఠకుడి గుండె గుబుక్కుమనకుండా ఉంటుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్రాయాలి. ఎందుకంటే వీరి కాన్వాస్ బహు విస్తృతం ... సాహిత్యం: సంస్కృతం, ఇంగ్లీషు, బెంగాలీ, తెలుగు; సంగీతం, సినిమా పాటలు ... అన్నీ వీరికి ప్రీతిపాత్రమే. అదంతా సమీక్షించటం నా వల్ల అయ్యే పని కాదు, ఎవరికి వారు చదువుకోవటమే ఆనందదాయకం. కాకపోతే ముగించే ముందుగా రెండు ఆసక్తికరమైన విషయాలు ప్రస్తావించాలి. ప్రముఖ రచయిత్రి జలంధరగారితో జరిపిన ముఖాముఖీ నా దృష్టిలో ఈ పుస్తకానికి మకుటం లాంటిది. “స్త్రీత్వం అంటే?” అన్న ప్రశ్నకి జలంధరగారి సమాధానం: “ఎంతో గొప్ప సాహిత్యం చదివి, జ్ఞానం సంపాదించి, పురుషుడు తెచ్చుకోగలిగిన సున్నితత్వపు గొప్పదనం స్త్రీకి పుట్టుకతో వస్తుంది. దాన్ని కోల్పోకూడదు. రాధ, యశోదల కలబోతే నిజమైన స్త్రీమూర్తి.” ఇంతకు మించిన నిర్వచనం ‘మృచ్ఛకటిక’ నాటకరచయితైన శూద్రక కూడా ఇవ్వలేకపోయాడు. ఈనాటి వివాహాలలోనే కాదు ఏనాటి వివాహంలోనైనా వైరస్యం లేకుండా ఉండాలంటే జలంధరగారిని మించి ఏ సైకియాట్రిస్ట్ సూచించగలిగినదేమీ లేదు: “సముద్రంలో ఉప్పు, అడవిలో ఉసిరికాయ తెచ్చి ఊరగాయ పెట్టటం వంటిది వివాహం. ఆ రెండిటికీ లేని కొత్తరుచి వస్తుంది అప్పుడు. మనం స్వేచ్ఛగా ఉండటం అవతల వారి స్వేచ్ఛకు ఆటంకం అవకూడదు. ఇందుకోసం ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉండాలేమో” (ఇదీ ఆపరేటివ్ పార్ట్). “తనతో తనకి శృతి కుదరకపోతే అది ఎక్కడికి దారితీస్తుంది? ఇందుకు చాలా ఆత్మపరిశీలన, విశ్లేషణ, శుభ్రపరుచుకోవటం అవసరం” అన్న జలంధరగారి మాటలు సాహిత్యవేత్తలకే కాదు ఈనాటి గ్లోబలైజ్డ్ మార్కెట్లో మసలుతున్న యువతకూడా ఆలోచింపతగినవి. ఇలా ఎన్నో తాత్త్వికభరిత సమాధానాలు, వాటిని ప్రేరేపించిన ఎన్నో తర్కబద్ధ ప్రశ్నలు – వెరసి వీరిద్దరూ సహృదయంతో ఎన్నో మంచిమాటలు మన ముందుంచారు.

“నీ అడుగు ఎక్కడ పడుతుందో గమనించుకుంటావు కదూ!” అంటూ ‘కౌమారపు పూలతోట’ తలుపులు మెల్లగా తెరచిన రచయిత్రి, కౌమారంలోని పిల్లలు ‘చిక్’ లిటరేచర్ కి అలవాటు పడి ఇబ్బంది పెట్టే “చెడ్డభాష”ను నేర్చుకోవటమే కాక యధేచ్ఛగా వాడుతున్నారంటూ కించిత్ వాపోతారు. అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు సాహిత్యపరంగా అదృష్టవంతులు. వాళ్ళు చదివే గ్రేడ్ తో సరితూగే పుస్తకాలు వాళ్ళకు కేటాయించి ఉంటాయి. కానీ మన పిల్లలకు ఈ సౌలభ్యం లేదు. ఈ విషయంలో తల్లితండ్రులు కూడా నిస్సహాయులే అంటారు రచయిత్రి. ఇది విలువైన పరిశీలన. పుస్తకపఠనం పిల్లలకు బాహ్యప్రపంచాన్ని పరిచయం చేస్తుంది. ముఖ్యంగా జీవితంలోని ఎగుడుదిగుడులు, సుఖదు:ఖాలు, ఇలా తల్లిదండ్రులు చెప్పని ఎన్నో నిజాలు వాళ్ళకర్ధమయ్యే రీతిలో పుస్తకాలు తెలియచేస్తాయి. చదవటం పిల్లలకు సహానుభూతి నేర్పుతాయి కూడా. వీటన్నిటి కోసం పిల్లల వయస్సుకు తగిన సాహిత్యం – చదివి అర్థం చేసుకోగల పుస్తకాలు అందుబాటులో ఉండాలి కదా! ఈ సమస్యకు పరిష్కారంగా రచయిత కొన్ని ఆంగ్లసాహిత్యంలో పుస్తకాలను సూచించారు కూడా. ఈ విషయం మీద మరి కొంత మనసు పెట్టి డాక్టర్ గారు పది నుంచి పదహారు సంవత్సరాల వయస్సు విద్యార్ధులకు తగిన మరియు అర్థం చేసుకోగలిగిన తెలుగు పుస్తకాల పేర్లను సూచించిన ఎంతో మేలు చెసినవారవుతారు.

‘ఈ లోకపు పొలిమేరలు’ శీర్షిక క్రింద అక్షరాలతో ఎన్నో ఆనందరాగాలు వినిపిస్తూ పాఠకులని పొలిమేరలు దాటించి ఏకంగా నీలాకాశంలో వదిలేస్తారు. అందులో ఒకటి, “మేరే నైనా సావన్ భాదొవ్ , ఫిర్ భీ మేరా మన్ ప్యాసా” – శ్రావణమేఘాలయిపొయిన నయనాలు. ఈ పాటలో కిషొర్ కుమార్ పలికించిన ఆర్తి అనుపమానం అంటూ ఆయనకో నమస్కారం చేసారు రచయిత్రి. డాక్టర్ గారు అన్నట్టు ఆర్‌డి ఈ సెమిక్లాసిక్ పాడటానికిగాను కిషొర్ ని నిజంగానే చిత్రహింస పెట్టాడు. మూడవ అంతర లోని ఆఖరి పంక్తి: ‘బీతే సమైకీ రేఖ’ అన్న మాటలని హైఆక్టేవ్‌లో పాడి ఒక్కసారిగా లోయర్ ఆక్టేవ్‌లోకి జారుతూ, “మైనే తుమ్ కో దేఖా” అనమంటాడు. అలా హైయ్యర్ కార్డ్‌లో నుంచి ఒక్కసారిగా లోయర్ కార్డ్ లో లాండ్ అవటం అన్నంత తేలికా! ఇంకా చెప్పాలంటే ‘రేఖా’లోని కోమలగాంధారం నుంచి శుద్ధగాంధారంలోకి ట్రాన్సిట్ అవటం ఈ పాటలోని ఓ హాంటింగ్ క్షణం. ఓ అద్భుతమైన ఊపు. ఈ అద్భుతాన్ని సృష్టించిన ఆర్‌డి కూడా ఏమీ తక్కువ కష్టపడలేదు. ఆ ఆర్కెస్ట్రేషన్ చూడండి ... ఈ పాట ప్రీలూడ్ ఆలాపనతో మొదలై ఓ మెలాంకలిక్-మెలోడియన్ బాస్ ఫ్లూట్ బిట్ తో ముగుస్తుంది. అలాగే వయొలిన్ ఫ్రేజెస్ , గిటారు స్ట్రమ్మింగ్ మరియు ఫ్లూట్‌తో కూడిన ఇంటర్ లూడ్స్ పాట పడే బాధని ఇంకొంచెం పైకెత్తుతాయి. ఉదాహరణకు పైననుకున్న చరణం ‘మైనే తుమ్‌కో దేఖా’ అని కిషొర్ పూర్తి చేయటంతోనే దాన్ని రౌండాఫ్ చేయటానికన్నట్టు బాస్ ఫ్లూట్ బిట్ వాడతారు. అందుకే మరి ఆ చరణం వింటున్నప్పుడు గుండె చిక్కబడుతుంది. ఇంత కష్టపడి ఆనంద్ బక్షి, కిషొర్, ఆర్‌డి కలసి వెలిబుచ్చిన వ్యధని, తృష్ణను డాక్టర్ గారు చూడండి ఎంచక్క నాలుగు తెలుగు మాటలలోకి ఎలా డీకాక్ట్ చేసారో: “ఎప్పుడో ఒక్క క్షణం తళుకుమన్న మెరుపుకాంతిలో కాలానికి అవతల ఏ గడిచిన జన్మలోనో కనిపించిన రూపం ... స్పష్టమవదు, మాసిపోదు ... ఆశ నిరాశల ఊయలలో అలసిపోతూ, నలిగిపోతూ ... ఎంత సిక్తమైపోతున్నా ఉపశమించని తృష్ణ!” ఈ పాటకూడా అలాగే ఎన్నిసార్లు విన్నా తీరని దాహంలా మరలా మరలా వినాలనిపిస్తుంది.

ముగించే ముందుగా ఈ పుస్తకానికి జలంధర గారు వ్రాసిన ముందుమాట గురించి మాట్లాడుకోకపోతే మర్యాదగా ఉండదు. ఎందుకంటే, ఈ పుస్తకం ద్వారా “విశ్వసాహిత్యంలోకి తొంగిచూడడమే కాక దానితోపాటు ఊహాదారిద్రయం నుంచి బయటపడిపోతాము ... రుచికరమైన జీవితాన్ని గడుపుతాం” అంటారు జలంధరగారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆ ‘విన్సమ్ నేరేషన్’ మనలోని ‘నిప్పచ్చరం’ని నిజంగా చెదరగొట్టేస్తుందని కూడా అంటారు. ఇక చదవమని వేరే చెప్పక్కర్లేదనుకుంటా!

No comments:

Post a Comment

Recent Posts

Recent Posts Widget