Google Translate

Wednesday, October 4, 2023

Mamidipudi Venkatarangaiah మామిడిపూడి వెంకటరంగయ్య (1889-1981)

 


సంస్కృతం నేర్చుకుని వేదపండితుడై ఎంచక్కా వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరులో హాయిగా ప్రకృతి ఒడిలో జీవించాలన్నది బాలుడి వాంఛ. అలా కాక బాగా చదువుకొని ఆంగ్లభాషలో పట్టుసాధించి ఏ తాసిల్దారుగానో, డిప్యూటీ కలెక్టరుగానో దర్పంతో జీవించే కొడుకుని చూడాలన్నది తండ్రి కోరిక.

డిగ్రీ చదువునుంచే వందేమాతరం ఉద్యమానికి ఆకర్షితులై బిపిన్ చంద్రపాల్ ఉపన్యాసాల ప్రేరణతో రాజకీయ చైతన్యాన్ని పొంది, దేశస్వరాజ్యం, విదేశీ వస్తువుల బహిష్కారములకు జీవితాన్ని అంకితం గావించి, ప్రభుత్వ ఉద్యోగంలో ఎట్టి పరిస్థితులలోనూ చేరకూడదని నిశ్చయించుకున్నారు ఈ ఎదిగిన యువకుడు. 

ఆ ప్రభావంతో ఎం.ఏ. పట్టా చేతబుచ్చుకొని ఏదో ఒక కళాశాలలో అధ్యాపకుడుగా చేరి, విద్యార్థులకు విద్యతో పాటు దేశభక్తిని కూడా ప్రబోధించవచ్చన్న ఆర్తితో పిఠాపురం మహారాజా కళాశాలలో ఆచార్యునిగా చేరి అటు తండ్రి కోర్కెను, ఇటు చిన్ననాటి తనకోర్కెను అధిగమించి, తన మనసుకు నచ్చిన వృత్తిని చేపట్టిన యువకుడే మన మామిడిపూడి వెంకటరంగయ్యగారు. ఎంతటి విద్యావినయ సంపన్నుడో అంతటి దృఢచిత్తుడు.

ఆ తరువాత విజయనగరం మహారాజా కళాశాలలో పదమూడు సంవత్సరాలు లెక్చరర్ గా పనిచేసి, 1931లో ఆంధ్రా విశ్వవిద్యాలయంలో చరిత్ర, ఆర్థికశాస్త్రం, రాజనీతిశాస్త్ర విభాగమునకు ఆధిపత్యాన్ని స్వీకరించారు. ఆదర్శనీయమైన ఆచార్యుడిగా శ్రీ కట్టమంచి రామలింగారెడ్డి, శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన్ లాంటి మేథావుల ప్రశంసలు పొందుటేగాక వెంకటరంగయ్యగారు ఎందరో శిష్యులను విద్యావేత్తలుగా, రాజనీతి విశారదులుగా, దేశభక్తులుగా తీర్చిదిద్ది 1944లో పదవీ విరమణ పొందారు.

అంధ్రా విశ్వవిద్యాలయంలో రాజనీతిశాస్త్రాచార్యులుగా పనిచేసిన వీరికి వ్యక్తి స్వేచ్చ, మహిళా వికాసం, భారతదేశ సమాఖ్య వ్యవస్థ, సామాజిక చారిత్రక అధ్యయనం మిక్కిలి ప్రియమైన విషయాలు. ఆధునిక భారతదేశ సామాఖ్య స్వరూప స్వభావాలను గురించి ప్రామాణిక గ్రంథాలు రచించి, యావద్భారతదేశంలోని  రాజనీతి చరిత్ర విద్యార్థులకు ఉపయుక్తాలుగా అందించారు. భారత స్వాతంత్రోద్యమ చరిత్రను విపులంగా మౌలిక విశ్లేషణతో మూడు సంపుటాలుగా రచించారు.

అప్పటి బొంబాయి విశ్వవిద్యాలయ ఉపాధ్యక్షులు కోరికమేర వారు కొత్తగా ఆరంభించిన పౌరశాస్త్రం, రాజనీతి అధ్యయన విభాగానికి మొట్టమొదటి ‘సర్ ఫిరోజ్ షా మెహతా ఆచార్యులు’ పదవినలంకరించి, ఆ శాఖను తీర్చిదిద్దారు. వెంకటరంగయ్యగారు స్వతంత్రంగా అలోచించుటయేకాక, నిశ్చితమైన తమ అభిప్రాయాలను నిర్భీతిగా వివిధ పత్రికలలో తమ రచనల ద్వారా అభివ్యక్తీకరించి, వాటి ఆచరణకు పాఠకులను ప్రోత్సహించారు.

విద్యావేత్తగా వీరికి బోధనా విషయంలో కొన్ని నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. విశ్వ విద్యాలయాల్లోని అధ్యాపకులు కేవలం పిల్లలకు పాఠాలుచెప్తే సరిపోదని, వారు పరిశోధనలు, గ్రంథ రచనలు చేయాలన్నది వీరి ప్రగాఢ విశ్వాసం. అప్పుడే విజ్ఞానాభివృద్ధి సాధ్యమన్నది వీరి నమ్మకం. తత్ఫలితంగా ఉపాధ్యాయులు తమ బోధనలో నూతనత్వాన్ని ఆవిష్కరించ గలిగినవారై విద్యార్థులలో పరిశోధనలపట్ల ఆసక్తిని కూడా పెంచగలరు అన్నది వీరి విశ్వాసం. అలా నడిచిననాడే విశ్వవిద్యాలయాలు తమ ఆశయసాధనలో సఫలీకృతం కాగలవు అన్న వెంకటరంగయ్యగారి పలుకులు ఈనాటికీ శిరోధార్యాలు.

ప్రాంతీయ భాషానుసారంగా రాష్ట్రాల పునర్నిర్మాణం చేయడంతోనే రాష్ట్రాలలో భాషాద్వేషం ముదిరిందన్నది వెంకటరంగయ్యగారి భావన. “ప్రాంతీయాభిమానాలు, భాషాభిమానాలు హద్దుమీరి పూర్వులలో ఉండిన సహనము మనలో లోపించినదనీ... దీనిమూలంగా దేశ విచ్చిత్తి సంభవించే ప్రమాదం ఉన్నదని...” ఏనాడో చెప్పారు.

అవినీతి, లంచగొండితనం గురించి మాట్లాడుతూ వీరంటారు, “మంత్రులు మొదలు గుమస్తాలు, బంట్రోతుల వరకు అందరూ లంచం ఇచ్చినప్పుడే తమ పనులను నిర్వహించుటకు అలవాటుపడిపోయినారు. అందరూ అష్టైశ్వర్యాలను అనుభవించటం ఒకటే లక్ష్యంగా పెట్టుకున్నారు...  లంచాలు తీసుకుంటేనేగాని ఇలాంటి (ఆడంబర) జీవితాన్ని సాగించడం వీలుకాదుకదా!”

మాతృభాషలో బోధనావశ్యకతను గుర్తు చేస్తూ వీరంటారు, ఈనాటి విద్యార్థులు మాతృభాషలో మాట్లాడటానికి, రాయటానికి తగిన శక్తిని, నైపుణ్యాన్ని సంపాదించుకోలేని వారుగా రూపొందారు. బహుశ ఇందుకు కారణం మాతృభాషను ఏ విధంగా నేర్పాలో ఉపాధ్యాయులకు తెలియకపోవడమో లేక తెలిసినా దానిని నేర్పాలన్న శ్రద్ధ ఉపాధ్యాయులకు లేకపోవడమో. సౌష్ఠవ విద్యాభ్యాసానికి సహాయపడని వ్యవస్థలు వ్యర్థం అంటూ, ఈ లోపాన్ని సరిదిద్దాల్సిన బాధ్యతను ప్రభుత్వం గుర్తించి బోధనా విధానాన్ని పటిష్టంచేయాలన్న వీరి సూచన ఈనాటికీ ఆచరణయోగ్యం. అంతేకాదు, దాని ఆవశ్యకత ఈనాడు మరీ ఎక్కువైందేమోకూడా!

అలాగే, ఈనాటి విద్యార్థులలో విద్యపట్ల గల శ్రద్ధ గురించి ప్రస్తావిస్తూ వారన్న మాటలు వినతగ్గవి: “విద్యార్థి దశను వారు విద్యను నేర్చుటకు వినియోగించుటకు బదులు ఆందోళనలు లేవదీయుటకు ఉపయోగించుచున్నారు... రాజకీయపక్షాల వారు విద్యార్థులను తమ తమ కార్యకలాపాలకై వినియోగించుకొనుచున్నారు. ఇది ఒక విధమైన స్వార్థం. అధ్యాపకులకు కూడా విద్యను నేర్పడంలో శ్రద్ధ తగ్గింది కదా!" ఈనాడు ఈ వ్యాధి ఇంకా ముదిరిందేమో అనిపిస్తుంది కదా! పరిష్కారం కొరకు ఎవరూ ప్రయత్నిస్తున్నట్లు కూడా లేదు!

ఆలోచించండి!


1 comments:

Dr. D. Ramachandra said...

Nice to read a blog in Telugu on Mamidipudi Venkata Rangaiah గారు.

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Recent Posts

Recent Posts Widget