Google Translate

Thursday, October 19, 2023

Palagummi Viswanadham - పాలగుమ్మి విశ్వనాథం (1919-2012)

ఆత్మ కథలు చదవటానికి ఆసక్తికరంగా ఉంటాయి. కొన్ని ఆత్మ కథలు మహా ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటాయి. చదువుతున్నంతసేపూ మన మనస్సులను ఒడిసి బిగపట్టుకొని ఉద్వేగంతో పరుగులెత్తిస్తాయి. పుస్తకం పూర్తిచేసేంతవరకు మనసు ఊరుకోదు. బహుశా అందుకు ఒక కారణము రచయిత యొక్క అపారమైన జీవన విస్తృతి అయి ఉండవచ్చు. లేదా, “అజ్ఞాన జీమూత / మలముకొన్న / జగాన / విజ్ఞాన చంద్రికలు / వెదజల్లినందుకయివుండవచ్చు.

ఆత్మ కథల్లో ఘటనలు, అనుభవాలూ వాస్తవాలు. వాటి వాసన, రుచీ వాస్తవాలు. అవి చదువుతుంటే మనమే అనుభవిస్తున్నామా అన్నంతగా వాటిలో లీనమైపోతాము. ఉదాహరణకు విశ్వనాథంగారి జీవితంలో ఘటన చూడండి:

వేసవి సెలవుల్లో విశ్వనాథంగారు వారి అమ్మతో తాతయ్య ఇంటికి వస్తారు. రాత్రి వారి అమ్మ, వారి పెద్దమామయ్యని “... నాకు రావలసిన సొమ్ము ఏర్పాటు చేస్తే, నా పిల్లల చదువులకి ఉపయోగపడుతుందిఅని వినయంగా అడుగుతుంది. లెక్కలు చెప్పిన పెద్దమామయ్య, “ఇంక నీకు ఇవ్వవలసినది ఏడు లేక ఏనిమిది వేలు ఉంటుంది. ఇపుడు నా దగ్గర డబ్బు లేదు. అది ఖర్చయిందిలే, నువ్వు నీ పిల్లలు ఇంట్లో ఉండొచ్చుఅంటాడు ఈసడింపుగా.

మాటలకి వారి అమ్మగారి రియాక్షన్ వారి మాటల్లో: “మా అమ్మ లేచింది. నేను మా అమ్మ చేయి పట్టుకున్నా అమ్మ కంట్లోంచి వెచ్చటి కన్నీటి చుక్కలు జారి నాచేతి మీద పడ్డాయి. మా అమ్మ కంఠం మొదట్లో కాస్త ఒణికింది. తరువాత నిబ్బరంగా నిశ్చలంగా అందిఇల్లు పట్టిన వెధవ ఆడపడుచులా నీ మోచేతికింద నీళ్ళు తాగుతూ, నీ పంచన పడివుంటాననుకుంటున్నావేమో!... ఇంటి ఆడపడుచును అన్యాయం చేసిన అన్నదమ్ములెవ్వరు బాగుపడలేదు... ‘ఒరేయ్! తమ్ముణ్ణి లేపరా... ఇవాల్టితో మీకు మీ తాతగారింటికి, నాకు పుట్టింటికి రుణం తీరిపోయిందీ అంటూ మా ఇద్దర్నీ చెరోచేత్తో పుచ్చుకొని నడిపించుకుంటూ, పెద్దవీధి సావిడి తలుపు తీస్తుంటే మా చిన్నత్తయ్య... అడ్డుపడివదినగారూ! ఇంత రాత్రి ఎక్కడకు వెళతారు? తెల్లవారనివ్వండీఅంటూ... బతిమాలింది. ‘చూడమ్మా! భానుమూర్తిగారింటి పరువు పట్టపగలు వీధినపటడం దేనికి! చీకట్లోనే నిశ్శబ్ధంగా కొంప వదిలిపోతే మా అన్నల ప్రతాపం కొంతకాలమైనా వీధినపడకుండా ఉంటుందిఅంటూ మమ్మల్ని వెంటపెట్టుకొని బయటికి నడిచింది

దృశ్యం చదువుతున్నంతసేపు గుండె చిక్కబడినట్లనిపిస్తుంది. గాఢమైన నిట్టూర్పు వెడలుతుంది. ఆశ్చర్యం కూడా కలుగుతుంది. ఏమా ధైర్యం! ఏమా నిర్భీతికత! మాటల్లో ఆమె దృఢ నిశ్చయం ప్రజ్వరిల్లుతుంది. మాటల్లోని వజ్రసంకల్పం ధ్రువతారలా మెరుస్తుంది.

మాటల విలువ అర్ధం చేసుకోవటానికి ఇచ్చట మనమొక విషయం గ్రహించాలి. మాటలు పలికినది వొక స్త్రీ. పైగా ఆమె వితంతువు. పెద్ద వయస్సూ కాదు. ఎవరి ఆదరా లేకుండా వొక్కతే పిల్లల్ని పక్కఊరిలో పెట్టి చదివించుకుంటుంది. పిల్లల్లో ఎవరూ కూడా ఇంకా చేతికి అంది రాలేదు. ఆనాటి సమాజములో వొంటరియైన సగటు స్త్రీ తన అన్నల్నిఎటువంటి వారైనతన అండగా భావిస్తుంది. ఇక్కడ ఇంకొక విషయం గమనించాలి. తను అలా ఛీకొట్టి బయటికి రావలసిన అవసరం లేదు. వారి నిజస్వరూపం తెలిసిన తను తన జాగ్రత్తలో తనుంటూ మసలుకోవచ్చు. విధంగా బయటి ప్రపంచానికి తన అన్నల అండ తనకు ఉన్నదని తెలియజేస్తూ, ఆచ్ఛాదనలో కొంత ధైర్యం పొందుతూ, జీవితం గడపవచ్చు.

కాని తన సత్ చింతనము, స్వాభిమానము ముందు బహుశా యీ అభిప్రాయాలు తనకు పేలవంగా కనిపించి వుంటాయి. మనసులో ఒక భావన, మాటలలో వేరొకటి పలికించడం ఆమెకు నచ్చి వుండదు. ఫలితం, అన్నలు, వారి అండా ముఖ్యమనిపించ లేదు. మాటే ముఖ్యంగా నిలిచింది. అంతే, నమ్మదగని అన్నల అండని ఛీకొట్టి బయటికి వచ్చేశారు. కేవలం తనకు తనమీదున్న నమ్మకం మాత్రమే సాహసం చేయటానికి పురికొల్పగలదు. బహుశా అదే ఆమె ఊపిరీ, బలం కూడా నేమో! అందుకే వారు అర్థరాత్రి అలా బయటికి రాగలిగారు, వచ్చిఇండిపెండెంట్గా బతకగలిగారు.

రచయిత అన్నట్టు ఇట్టి వాస్తవ సంఘటనలు అనుభవించిన వారికే కాక చదివిన వారిమనస్సులో [కూడా] తిష్ట వేసుకు కూర్చుంటాయి. ఎంత కాలమైనా వాటి తీవ్రత, స్పష్టత తగ్గదు”. అంతే కాదు, పెద్దలన్నట్లు వాస్తవ ఘటనలు వాస్తవాచరణకు దారితీస్తాయి కూడా. నమ్మశక్యంగా లేదా? అయితే విశ్వనాథంగారి జీవితంలో జరిగిన మరొక సంఘటన చూడండి:

ఒకరోజు కృష్ణశాస్త్రిగారు, కాటూరి వెంకటేశ్వరరావుగారు, త్యాగయ్య, క్షేత్రయ్య గురించి మాట్లాడుతూ, “త్యాగయ్య రచనల్లో కవిత్వ గుణం తక్కువేమో!” అన్నారట. అది విన్న విశ్వనాథం గారికి ఒక్కసారిగా ఆవేశం తన్నుకొచ్చిందిట.

అయినా తన ఆవేశాన్ని కాస్త అణగద్రొక్కి ఇలా అన్నారట: ఏమోనండికవిత్వం సంగతి నాకు తెలియదుగాని, భావకవితా యుగంలో... వచ్చిన ప్రసిద్ధ కవుల రచనలు ఎంతకాలం బ్రతుకుతాయో కనీసం అంతకాలమైనా త్యాగరాజు కీర్తనలు బ్రతికే ఉంటాయి”. మరొక్క విషయం: మీ అందరి రచనలు ఆంధ్రదేశం పొలిమేరలు దాటి బయట వినిపించవు. కాని త్యాగరాజు కీర్తనల ప్రభావానికి సరిహద్దులు లేవు”.

గుర్తుంచుకోవలసిన మరో విషయముంది. “ఆయన రచనలు సంగీతం నుండి విడదీసి చదువుకోడానికి ఉద్దేశింపబడిన రచనలు కావు. ఉదాహరణకి,  ఒక త్యాగరాజు కీర్తన పల్లవి. “నీ దయరాదా?” అనుపల్లవి: “కాదనె వారెవరు కళ్యాణరామ, మాటల్లో కవిత్వం ఏముంది? ఎవరైనా మాటలు అనవచ్చు. కాని త్యాగరాజస్వామి మాటలను నాదసముద్రంలో జలకాలాడించి, వసంతభైరవి రాగాలంకరణ చేసి, శ్రోతలకు వినిపిస్తే, చచ్చు మాటల అర్దాలను మించిన ఆనందాన్ని పంచిపెడుతుంది

ఆవేశంలో వారు పలికిన ఆ పలుకులలో వారి అమ్మగారి ప్రవర్తన ప్రతిబింబిస్తుంది.

గంతులేస్తూ, పగలబడి నవ్వుతూ... అల్లారుముద్దుగ పెరిగే చిన్నది, ఎవడి చేతుల్లో పడుతుందో? గలగలమని నవ్వులు బిందులు తొక్కే మోము, కలకలాం అల్లగే ఉంటుందా? విషాదచ్చాయలు దరి రాకుండా చూసే జతగాడు దొరుకుతాడా?” ఇట్టి ఆలోచనలతో బరువెక్కిన హృదయం నుంచి వెలువడిన విశ్వనాధంగారి పాటంటే నాకేగాదు. ఎందరికో మహా ఇష్టం: “అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ.

అలాగే చెమటలు గ్రక్కుతూ పంకా కింద కూలబడి, అయ్యో పైరుగాలులకి దూరమై, పంకా గాలిలో చిక్కుకుపొయానే!” అన్న వ్యధలో నుంచి చిందిన ఈ పాటంటే నాకు మరీ ఇష్టం:

“పంట చేలగట్ల మీద తిరగాలి

ఊహలేమొ రెక్కలొచ్చి ఎగరాలి

మా ఉర్రు ఒక్కసారి పోయిరావాలి

జ్ఞాపకాల బరువుతో తిరిగి రావాలి

అలా ఇంకెన్నోఘటనలు! వాటన్నింటి వివరణ, విశ్లేషణ, ఇచ్చట ప్రస్తుతించుట వివేకమనిపించుకోదు. వాటిని పాఠకుల ఆనందానికి వదలడమే ఉచితం. అప్పుడే అది వారి సొంతఎక్ స్ పీరియన్స్గా మారి ఆత్మ కథ చదివిన ఆనందాన్ని అందించగలదు.

ఆఖరి వాక్యం వరకు త్యాగరాజు వారి కృతిలాగ మోహనంగా సాగిన పాలగుమ్మి విశ్వనాథం గారి

 (Retired as Music Director, All India Radio, Hyderabad) ఆత్మ కథను  చదివి తీరవలిసిందే.

1 comments:

Dr. D. Ramachandra said...

చాల బాగున్నది. మీకు అబినందనాలు

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...

Recent Posts

Recent Posts Widget