మరి కృష్ణశాస్త్రిగారంటే ఎందుకు అంత ఇది! "వింతగా దోచు నాదు జీవితం నాకే!" అన్నందుకా? "ఏను మరణించుచున్నాను; —ఇటు నశించు / నా కొరకు చెమ్మగిల నయనమ్ము లేదు" అని వాపోయినందుకా? లేక "నానివాసమ్ము తొలిత గంధర్వ లోక సుషమా సుధాగాన మంజువాటి" అంటూ తెలుగు సాహితీ సరసిలో "రాయంచవలె విహారము" సల్పినందుకా? "మీరు మనసారగా నేడ్వనీరు నన్ను" అని విలపించినందుకా? లేక ఈ గోడంతా ఏమిటో అని అర్ధం కాకా? ఏమో మరి!
ధైర్యానికి, సాహసానికి, జీవితం పట్ల ఆశకి, ఆసక్తికి, "ఆరలేని కోరిక"లతో ఏదో సాధించాలి అన్న తపనకీ ప్రతీక అయిన యువతకి, కృష్ణశాస్త్రిగారి "విషాద భావనాభరితమయిన గీతా”ల కి ఏమిటీ అనుబంధం? ఎందుకంత ఇది? అదే ఓ విచిత్రం. బహుశా, అప్పుడే మొదలైన ఇంగ్లీష్ చదువులు చదివి వర్డ్స్ వర్త్, షెల్లీ, కీట్స్ మొదలగు ఆంగ్ల కవులచే ప్రభావితులైన యువతకు కృష్ణశాస్త్రిగారు తనకు తానుగా కవిత్వం చెప్పుకొన్న రీతికి—ఆ విష్పర్స్ కి, ఆ నూతనత్వానికి—సంభ్రమాశ్చర్యాలలో తేలియాడి, ఆయనంటే ఓ ఆరాధనాభావం పెంచుకున్నారేమో!
నల్లమల అడవులలో ఆగిపోయిన బండిలో నుంచి ఆ పచ్చటి చెట్లగుంపుని చూసి “ఆకులో నాకునై పూవులో బూవునై / కొమ్మలోఁ గొమ్మనై నునులేఁత రెమ్మనై / ఈ యడవి దాగిపోనా / ఎట్లైన / నిచటనే యాగిపోనా” అని పాడుకుంటూ ఆ చెట్లలో ఒక చెట్టుగా మమేకమైన కృష్ణశాస్త్రిగారి విష్పర్స్ విన్న ఆనాటి యువతికి ఆయన తలపే ఓ పులకింతేమో! ‘ఎట్లైన నిచటనే యాగిపోనా’ అని చెప్పటంలో ఎంతో బరువైన భావోద్వేగం లేక గాఢమైన కోరికో వినపడుతుంది. అందునా, కవి, తనలో తాను (ఆ 'గాఢతను') ఎరుక చేసుకుంటున్నట్లు ధ్వనిస్తుంది. మరి ఆ విష్పర్స్ విన్నవాని మది పులకించదా? అందునా యువతకి!
ఆ విధంగా కృష్ణశాస్త్రిగారు ఓ రకంగా పాఠకుడు నుంచి స్వేచ్చని పొంది తనకోసం తను పాడుకుంటున్నట్టు కవిత్వీకరించారు. అందుకే ఆయన ఓ కవితలో “నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు? నా ఇచ్చయేగాక నాకేటి వెరపు?” అంటారు. తన ఈ స్వేచ్చకి సమాధానంగా గాబోలు ఓ కవితలో ఇలా అంటారు: “సౌరభము లేల చిమ్ముఁ పుష్పవ్రజంబు? / చంద్రికల నేల వెదఁజల్లు జందమామ? / ఏల సలిలంబు పారు? గాడ్పేల విసురు? / ఏల నా హృదయంబు ప్రేమించు నిన్ను? / మావిగున్న కొమ్మను మధుమాసవేళఁ / బల్లవము మెక్కి కోయిల పాడు టేల? / పరులఁ దనియించుటకొ? తన బాగు కొరకొ? / గాన మొనరింపక బ్రతుకు గడవఁ బోకొ?” అలా కోకిలకు పాట పాడటం ఎంత సహజమో కవిత్వం వ్రాయటం తనకూ అంతే సహజం అని చెప్పకనే చెప్తున్నారు. ఆ విధంగా, ఆయన తనని తాను తత్కాలీన కవిత్వ ధోరణలనే బంధాల నుంచి విముక్తుడిని చేసుకొన్నాడనిపిస్తుంది.
ఏదో పోగొట్టుకున్నటువంటి—‘సెన్స్ ఆఫ్ లాస్’—భావన ‘కృష్ణపక్షం’ లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆ భావనను గాఢాతిగాఢమైన
పదజాలంతో వ్యక్తపరుస్తారు. ఉదాహరణకు ఈ వేదన చూడండి: “అపుడు నా వైపు చూచి నా యలరు లేని / శూన్యమౌ మ్రోడు మ్రాకును జూచి, యొక్క / కోకిలమ్ము కో యని యేడ్చె, గొంతు నెత్తి! / మాకొరకు దారిబోయెడు మందపవను / డొకఁడు జాలిగ నొక్క నిట్టూర్పు విసరె!” తన బాధ పంచుకోవటానికి ఒక కోకిల, ఒక మంద పవనం తప్ప మానవమాత్రుడెవడూ లేడట! ఆ బాధను ఓదార్చ “లేక కన్నులట్టె యార్చుకునినవి తారకలు” అని వాపోతారు. తరువాత
కవితా సంగ్రహం: 'ప్రవాసం'. ఇందులో తన మానసిక ప్రవాసం గురించి ఇలా అద్భుతంగా ప్రకటిస్తారు:
“ఏను మరణించుచున్నాను; ఇటు నశించు / నా కొరకు చెమ్మగల నయనమ్ము లేదు”. ఈ “ఏను మరణించుచున్నాను” అన్న వాక్యం
చదువుతుంటే బైబిల్ లోని (జాన్ 11:35) "జీసస్ వెప్ట్" అన్న వర్స్ ఠక్కున మదిలో
మెదులుతుంది. ఈ 'ప్రవాసం' ఓ "వెసటి లేని వెర్రి అన్వేషణమ్ము" లా సాగుతుంది.
ఇక 'ఊర్వసి’ అయితే "ఎదియొ అపూర్వమధుర / రక్తి స్ఫురియించు గాని అర్ధమ్ము కాని
/ భావగీతమ్ముల" తో నర్తిస్తుంది.
ఇలా చెప్పుకొంటూ పోతే, "ఎన్ని
చుక్కలపాటు లెన్నెన్ని మెరపులు!" ఏది ఏమైనా,
సంజీవదేవ్ గారన్నట్లు కృష్ణశాస్త్రిగారి "ప్రతి మాటా ఒక పాటే. ఆయన పదాలు భావగర్భితాలే
కాక సునాద గర్భితాలు" కూడా. అందరు కవులు భావాన్ని సృష్టించడానికి మాటలనువాడితే
ఈ 'ఉన్మత్త భావశాలి’ మాటల్ని సృష్టించడానికి—‘మూగ కనులు
మోయలేని చూపు’; ‘ఒక
మౌనబాష్పకణమటు,’ ‘ఏనొక వియోగశాలినీ విరహ వేదనారేఖ(ను)’—కనరాని భావాలకై “ఒక క్రొత్త బరువుతో, ఒక క్రొత్త యాసతో ఒక్కడై
పడిపోయే...” అట్టి మాటలు 'మల్లెల మాలలూ’, 'వెన్నెల డోలలూ’ గాక, మరేమగు!
కృష్ణశాస్త్రిగారి
కవితే గాదు, గద్యమూ శ్రవణానందమే. కవితలోనే కాదు, గద్యములో కూడా వారు శబ్ద చిత్రాలను
ఆవిష్కరించారు. ఓ వ్యాసంలో, "పల్లెటూరూ, ఊరు ప్రక్క ఏరూ, ఏటి ఒడ్డున వెదురు పొదా,
పొద చెంత పుంతా, పుంతకి వెనుక మాలి తోటా, తోటకవతల వరి చేలూ, గట్లు, పంట కాలువలూ..."
అంటూ ఓ పలికే చిత్రాన్ని సృష్టించిన స్రష్ట వీరు.
వీరి భావుకత కేవలం భావుకతే కాదు. తాత్త్విక రాగాల సమ్మేళనం కూడా. తమ 'కోవెల-కొలను' అన్న వ్యాసంలో కృష్ణశాస్త్రిగారు ఇలా అంటారు "మరి దేవళంలో కాగడాలే కాని విద్యుద్దీపాలు బాగుండవు... కాగడాల పక్కనే పొంచి ఉన్న చీకట్లు మన అంతరంగాలంత లోతుగా ఉంటాయి. కాగడాలు కునుకుతూ దేవాలయాన్ని వింతగా చూపిస్తాయి. కాగడాలు వూగుతూ కొలనిలో వెలుగు తరగలను లేపుతాయి". మరి ఈ సజీవ చిత్రం మన మనసులలో భగవత్ చింతనా తరగలను లేపకుండునా!
అందుకేనేమో
దేవులపల్లి వారి స్మరణే ఓ అనుభూతి కాగలిగింది. ఆనాటి యువతకు వారి తలపే ఓ వింత పులకింత.
తీపి బాధలతో సాగిన దేవులపల్లి వారి సాహితీ ప్రయాణం ఈనాటికీ పాఠకుల మనస్సులో పచ్చిగానే
నిలిచినది.
ఈనాడు మన సమాజం అతి వేగంగా పరివర్తన చెందుతున్నది. తెలిసిన పాత నుంచి తెలియని ఓ క్రొత్తలోకి అడుగిడుతోంది. ప్రపంచీకరణలో రోజు రోజుకి మారుతున్న ఆర్థిక వ్యవస్థలో ఏదో స్థిరత్వం సాధించాలని యువత తహతహ! ఏవో ఆలోచనలు, ఆత్రుత. అర్ధం కాని ఉత్సాహం! ఓ తెలియని భయం. వీటి మధ్య ఎవరో తరుముకొస్తున్నట్లు పరుగులు—జీవితమే ఓ పరుగు పందెంలా తయారైంది. ఒక్కొక్కప్పుడు వెనుకబడ్డామా అన్న భయం, నిరాశ, ఏదో వెలితి. నిస్తేజం!
ఈ
పరుగుల, బాధల నడిమి "మధుప మయ్యెద జందమామ నయ్యెదను / మేఘ మయ్యెద వింత మెరపు నయ్యెదను"
అంటూ సాగే వీరి కవిత్వ పఠనం రవ్వంత ఆనందదాయకమేమో! ఎందుకంటే, 'బాధ’ మన దృష్టిని నిశితంగా
చేస్తుందట. వేదన ప్రేమని పుట్టిస్తుందట, ప్రేమ నిండిన హృదయం ఆనందమయం కదా!
**

చాల బాగ వ్రాశారు. మీరు వ్రాసిన ఆ "ఇది" ఏమిటో!
ReplyDeleteధన్య వాదాలు రామచంద్ర గారు... అదో ఊహ కందని ఇది!
ReplyDelete