Monday, November 27, 2017

Plato’s 'Republic' : Dr GVK’s Translation into Telugu

ప్లేటో క్రీస్తుపూర్వం 427లో సంస్కృతికి నిలయమైన అలనాటి ఏథె న్స్ లో జన్మించాడు. ‘టోటీ?’ ‘టోటీ?’ (ఏంటీ ఏంటీ) అంటూ ప్రతి విషయం గురించి ఎదురుపడిన వ్యక్తితో వాదం పెట్టుకొని తన డైలెక్టిక్ పద్ధతిలో వాదిస్తూ ఎంతటి మేధావినైనా చిత్తుచేసి తత్త్వవేత్తలలో అగ్రగణ్యుడిగా ఆనాడూ, ఈనాడూ కొనియాడబడే సోక్రటీస్ ఇతనికి గురువు. ఈయన సోక్రటీస్‌కు ప్రియశిష్యుడే కాదు, భాష్యకారుడు కూడా. ప్లేటో తన రచనలలో సోక్రటీస్‌ను సర్వోన్నత తాత్త్వికునిగా చిత్రిస్తారు.

ప్లేటో అత్యంత ప్రతిభాశాలి. ఈయన రచనలు జగద్విఖ్యాతం. ఈయన తన రచనలలో చర్చించని విషయమంటూ లేదనుటలో ఇసుమంతైనా అతిశయోక్తి లేదు. జ్ఞానస్వరూపం, సృష్టిక్రమం, జగత్తత్త్వం, ధర్మస్వరూపం, మానవ జీవితాదర్శం, పురుషార్ధాలు, భాషాతత్త్వం, ప్రణయరహస్యం, కళాతత్త్వం, జాతీయ విద్యావిధానం, పరిపాలనావిధానం, పౌరశాస్త్రం, గణితశాస్త్రం, జ్యోతి శాస్త్రం, రేఖాగణితం, సంఖ్యాతత్త్వం, జీవశాస్త్రం, వైద్యశాస్త్రం ఇత్యాది శాస్త్రాలయందలి సూక్ష్మాతిసూక్ష్మాంశాలను కూడా చర్చించాడు. ఇతని రచనలలో ప్రత్యేకత ఉంది: అవి సంభాషణ రూపంలోప్రతిపాదనలు, వాదనలు, ఖండనలుసాగుతాయి. ఇతని రచనలలో చర్చలు ఎంత గంభీర విషయం గురించి ఎంత లోతుగా సాగుతున్నా సరే అవి చదవటానికి సుఖంగా ఉంటాయి. ఈయన మరో ప్రత్యేకత, ఏదీ ఇదమిత్థంగా తేల్చి చెప్పడు. వాదనల సారాంశం నుంచి పాఠకుడినే సిద్ధాంతీకరించు కోమంటాడు. ఈనాటికీ ఈయన రచనలు పాశ్చాత్య దార్శనికులకు శిరోధార్యాలు.

ఈయన రచనలన్నిటిలోరిపబ్లిక్జగత్ప్రసిద్ధమైనది. ప్రపంచ సాహితీ చరిత్రలో విశిష్ఠస్థానం ఆక్రమిస్తుంది. విశిష్ఠతను పురస్కరించుకొని పుస్తకం పాశ్చాత్య భాషలన్నిటిలోకీ అనువదించబడింది. పాశ్చాత్య దర్శనాన్ని, సంస్కృతిని అర్ధం చేసుకోవటానికి రచన ఎంతగానో ఉపకరిస్తుంది. ఇది గ్రహించిన సాహిత్య అకాడమి, న్యూఢిల్లీ వారు గ్రంథాన్ని తెలుగులో అనువదించటానికి కృష్ణారావుగారిని అడగటం, ఆయన దీనిని తెలుగులోకిఆదర్శరాజ్యం’ గా 1961లో అనువదించటం జరిగాయి. అనువాదానికి కృష్ణారావుగారు బెంజమిన్ జోవిట్ ఆంగ్లంలోకి అనువదించిన ప్లేటో రిపబ్లిక్‌ను మూలంగా స్వీకరించారు. పందొమ్మిదో శతాబ్ధపు గ్రేటెస్ట్ టీచర్ గా గుర్తించబడిన బెంజమిన్ జోవిట్ ప్లేటో గ్రంథాల అనువాదకుడిగా పేరుగాంచాడు. దాదాపు 30 సంవత్సరాలు అధ్యయనం చేసి, శోధించి అనువదించినరిపబ్లిక్ను అయన చనిపోయిన తర్వాత 1894లో ముద్రించారు. బహుశా గుణగణాలని దృష్టిలో ఉంచుకొని కాబోలు ఆనాటికి ఉన్న నాలుగైదు ఆంగ్ల అనువాద గ్రంథాల నుంచి  ఈ అనువాదాన్ని కృష్ణారావుగారు తన మూల గ్రంథంగా ఎన్నుకున్నారు. విజాతీయమైన గ్రంథంలోని దర్శనాన్ని, దానిని వ్యక్తీకరించటానికి ప్లేటో అవలంబించిన కవిత్వ ధోరణిని తెలుగు పాఠకుడు ఆస్వాదించటానికి తగిన రీతిలో అనువదించటమే తమ వ్రతంగా సాగిన రచన ఎంతవరకు సఫలీకృతమైందో పాఠకులే చెప్పాలంటూ తన ధ్యేయాన్ని కృష్ణారావుగారు ప్రస్థానంలో స్పష్టంగా తెలియజేసారు. గ్రంథం ఎంతవరకు అనువాదకుడు ఆశించిన ఫలితాన్ని సాధించిందో పరిశీలించే ముందుగా 'ఆదర్శరాజ్యం'లో ప్లేటో ఏం చెప్తున్నాడో సంగ్రహంగా తెలుసుకుందాం

1. ఆదర్శరాజ్యం: ప్లేటో ఏం చెప్తున్నాడు?
ఓనాడు పిరీస్ రేవు సమీపాన సిఫాలస్ అనే వర్తకుని ఆవాసమందు కొందరు మిత్రులు సమావేశమయ్యారు. అందులో సోక్రటీస్ ఒకడు. గృహ యజమాని కుమారుడు పాలిమార్కస్, సోఫిస్ట్ తత్త్వవేత్త థ్రాసిమార్కస్, ప్లేటో సోదరులైన గ్లాకన్ మరియు అడిమాంతస్ సదస్యులు. మరొక ఐదుగురు శ్రోతలు. వీరిమధ్య సోక్రటీస్ సిఫాలస్ను, “చరమదశలో జీవితం కష్టతరమా?” అని అడుగుతాడు. అదంత ఉత్సాహంగా ముందుకు సాగదు. దానితో చర్చ న్యాయం వైపు మళ్ళుతుంది. “మనుషులు న్యాయంగా ఎందుకు ప్రవర్తిస్తారు? సామాజిక భీతితో న్యాయంగా ప్రవర్తిస్తారా? లేక మనుషులు ధర్మంగా నడుచుకోవటంవల్ల తమకు మంచి జరుగుతుందన్న నమ్మకంతో న్యాయంగా ప్రవర్తిస్తున్నారా? న్యాయం, న్యాయం కొరకేనా లేక అది అందించే ప్రతిఫలం కొరకా లేక రెండింటి కొరకా? న్యాయాన్ని ఎలా నిర్వచించాలి?” సన్నివేశంతో మొదలవుతుంది ప్లేటో రిపబ్లిక్.

ప్రశ్నలు, తత్సంబంధిత చర్చతో తృప్తి చెందని గ్లాకన్ సోక్రటీస్ తో ఇలా అంటాడు: “న్యాయమనుష్టించేవారు తమకిష్టం లేకపొయినా గత్యంతరం లేక ఆచరిస్తున్నారే కానీ, మేలని ఎంచి ఆచరించటం లేదు. న్యాయవంతుని జీవితంకంటే అన్యావంతుని జీవితం ఎంతో మెరుగని థ్రాసిమాకస్ మొదలగువారు అనుకుంటున్నారు. అన్యాయం కంటే న్యాయం ఉత్తమమని సంతృప్తికరంగా ఎవరూ నిరూపించగా వినలేదు. న్యాయం తనకుతానుగా మంచిదని మీరు శ్లాఘిస్తే వినాలని ఉన్నది.”  “అంతకంటే ముచ్చటించతగిందేముంది?” అంటూ మొదలైన సంభాషణ పది పరిచ్ఛేదాలు గలరిపబ్లిక్అనే గ్రంథంగా రూపు దిద్దుకొంది.

వ్యక్తిగుణమని, మరొకప్పుడు రాజ్యగుణమని పేర్కొనబడే న్యాయం గురించి పరిపూర్ణంగా తెలుసుకోవటానికి ముందుగా రాజ్యాలలో గోచరించే న్యాయాన్యాయాల స్వభావం పరిశీలిద్దామంటూ తన విశ్లేషణ మొదలుపెడతాడు. రాజ్యం ఎలా ఉద్భవిస్తున్నదో పరిశీలిస్తే న్యాయాన్యాయాలు ఎలా అవతరిస్తున్నవో గ్రహించవచ్చు కదా! కాబట్టి మనం ప్రథమంగా రాజ్యనిర్మితికి ప్రయత్నిద్దాం అంటూ ప్లేటో తన దృష్టిలో ఆదర్శరాజ్య వ్యవస్థ ఎలా ఉండాలో సోక్రటీస్ ముఖతః చిత్రిస్తాడు. గ్రంథానికిరిపబ్లిక్అన్న పేరు సరైనది కాదన్నది అనేకుల వాదన. దృష్టితో పరిశీలిస్తేఆదర్శరాజ్యంఅన్న పేరు తెలుగు అనువాదానికి సరైనదిగా పేర్కొనవచ్చు.

1.1 త్రివర్గాలు
మానవజాతి అవసరాలనుబట్టి రాజ్యం ఏర్పడుతుంది. అందలి మనుషుల వాంఛితాలు తీర్చటానికి అనేకులుండాలి. ఒకరి ప్రయోజనానికి ఒకరి సాయం, మరొక ప్రయోజనానికి మరొకరి సాయం స్వీకరిస్తూ అనేక సహాయులు ఒకే ప్రాంతంలో వ్యవస్థీకృతులైనప్పుడు, తత్ప్రాంత వాసుల సంఘం రాజ్యంగా చెప్పబడుతుంది. వీరిని మూడు వర్గాలుగా విభజిస్తాడు: మొదటి వర్గం: సామాన్యులుఉత్పత్తిదారులు (రైతులు, చర్మకారులు, వృత్తిపనివారు). తమ స్వభావానికి అనుగుణమైన వృత్తిని చేపట్టి, ఇతర వృత్తులజోలికి పోకుండా పాటుపడినప్పుడు ఎల్ల వస్తువులు సమృద్ధంగా, సులువుగా, మిన్నగా ఉత్పన్నమవుతాయన్నది ఈయన సిద్ధాంతం. రెండవ వర్గం: మధ్యములురక్షక వర్గం (సైనికులు). రాజ్యరక్షణకై ఉత్సాహోద్దీప్తిమంతులైన, సౌమ్యస్వభావులైన యువకులు తగు శిక్షణ పొంది, రాజ్య రక్షణ చేపడతారు. మూడవ వర్గం: ఉత్తములుతత్త్వజ్ఞానులు. వీరు పాలకాంశమైన వివేకం, పాలనీయాలైన ఉత్సాహకామాలు కలిగి నిగ్రహవంతులై తగిన పాలనాపరమైన శిక్షణను పొంది పరీక్షల ద్వారా పాలకవర్గంలోకి ఎన్నుకోబడి రాజ్యపాలన చేయుటకు అర్హత పొందగలరు. విధంగా ప్లేటో ఆదర్శరాజ్యాంలో మూడు విస్పష్టవర్గాలు ఏర్పడతాయి. ఇందు స్త్రీలు, పురుషులు సమాన హక్కుదారులు. ఒక వర్గం మరొక వర్గంగా మారటమేమి, ఒక వర్గ ధర్మం వేరొక వర్గం అనుసరించటంకానీ రాజ్యానికి అత్యంత అనర్ధకహేతువు అంటాడు ప్లేటో. వణిజుడు, యుద్ధభటుడు, పాలకుడు తమ తమ ధర్మాలను నిర్వర్తించటం న్యాయం. అలా ఎవరి వృత్తివారు నిర్వర్తిస్తున్నంతకాలం సమాజంలో న్యాయం వెల్లివిరిసి రాజ్యం న్యాయవంత మవుతుందన్నది ప్లేటో నమ్మకం.

1.2 త్రిగుణాలు
విభజన ప్రజామోదం పొందాలన్న పౌరులకు మనం ఇలా చెప్పాలి అంటాడు ప్లేటో: “మీరంతా సోదరులు. మిమ్ము ఈశ్వరుడు విభిన్నంగా సృష్టించాడంటాడు. కొంతమందికి శాసనశక్తి ఉంటుంది. అలాంటివారిని ఈశ్వరుడు సువర్ణంతో నిర్మించాడు. సైనికులను రజతంతో నిర్మించాడు. కావున వారు పరమమాన్యులు. కర్షకులను, ఇతర వృత్తులవారిని ఇనుముతో సృష్టించాడు. స్వతఃసిద్ధంగా ఏర్పడిన ప్రవృత్తులకు తగిన వృత్తిని ఎవరికివారు అవలంబించటం ధర్మం.”

ఆదిలో అంతా ఒకే జాతివారైనా స్వర్ణమయులైన తల్లిదండ్రులకు ఒక్కొక్కప్పుడు రజతమయుడైన పుత్రుడూ, రజతములైన తల్లిదండ్రులకు స్వర్ణమయుడైన పుత్రుడూ పుట్టవచ్చు. జాతి స్వచ్ఛతాభిరక్షణ కంటే పాలకులకు రక్షణీయమైన ఉత్తమ ధర్మం మరొకటి లేదు. ఇది ఈశ్వరుడి ఆజ్ఞ. కాబట్టి పాలకుడు కారుణ్యక్రోధాలకు తావివ్వక జాగరూకుడై సంతానంలో ఏయే ధాతువులు ఎలా సమ్మిశ్రితాలవుతున్నాయో కనిపెట్టి వారిని తగు వర్గంలో చేర్చాలి.

రాజ్యలక్ష్యాన్ని సాధించాలంటే కథను పాలితులకు, పాలకులకు చెప్పి నమ్మించాలి. విషమువలె అసత్యాన్ని తగు మోతాదులో వాడటం శ్రేయోదాయకం అంటాడు ప్లేటో. న్యాయవిహితమైనా, దీని వినియోగం వివాహ, శిశూత్పాదన వ్యవస్థలలో తరచు ఆవశ్యకమని కూడా ప్లేటో గుర్తిస్తాడు. ఆదర్శరాజ్యం కొరకు అసత్య ప్రచారం తప్పదని ఈయన భావన. మొదటితరంలో ప్రచారాన్ని ప్రజలంతగా విశ్వసించకపోవచ్చు. కానీ విద్యావిధానంవల్ల, నిరంతర బోధన వల్ల కొన్ని తరాలలో ఈ వర్గ విభజన స్థిరపడగలదన్నది ఈయన నమ్మకం. ఒకసారి విశ్వాసం రూఢమైతే పౌరులు తమ రాజ్యమందూ, పరస్పర శ్రేయస్సునందూ అధిక శ్రద్ధ వహిస్తారు. న్యాయం పరిఢవిల్లుతుంది. కాబట్టి ప్రతివారికీ గరిష్ట సుఖం ప్రాప్తిస్తుంది.

1.3 త్రిగుణాత్మక స్వభావం
మానవుడి ఆత్మలో ఉత్తమ ప్రకృతి, అధమ ప్రకృతి అని రెండు ప్రకృతులున్నాయి. ఉత్తమ ప్రకృతిచే అధమ ప్రకృతిని అదుపుపొదుపులలో ఉంచిన మానవుడు తనపై తను అధికారి అని చెప్పబడుతున్నాడు. అట్లు కాక దుస్సాంగత్యంవల్లనో, దుష్టబోధనల వల్లనో మానవునిలోని ఉత్తమ ప్రకృతి నశించి, అధమ ప్రకృతిచే ప్రభావితుడై ప్రవర్తించినప్పుడు నియమరహితుడనీ, ఆత్మదాసుడనీ నిందింపబడుతున్నాడు.

కాబట్టి ఆత్మలో రెండు తత్త్వాలున్నవని చెప్పవచ్చు. ఒకటి వివేకం: దీనితో మానవుడు వివేచిస్తాడు. వివేచనతో సత్యం కొరకు ప్రాకులాడతాడు. అది సహజంగా అతనిలో తాత్త్వికతను పెంచుతుంది. రెండవ తత్త్వం: తృష్ణ లేక అవివేకం. ఇది వివిధ సుఖాలకూ, సంతృప్తులకూ సైదోడు. రెంటికి తోడు మరొక తత్త్వం కూడా ప్లేటో ప్రస్తావిస్తాడు: ఉత్సాహం. ఇది గౌరవాన్ని కాంక్షిస్తుంది. మన కోపతాపాలకూ మూలస్థానం. ఉత్సాహం దుష్టవిద్య మరియు శిక్షణ వల్ల కలుషితం కానంతవరకూ వివేచనకు సహకారిగా ఉంటుంది.

గుణత్రయం స్నిగ్ధమై సామరస్యం కలిగి ఉండాలి. పాలకాంశమైన వివేకం, పాలనీయాలైన ఉత్సాహకామాలు వివేకపాలనను అంగీకరించి, తిరుగుబాటులేక మెలగాలి. అట్టి స్థితి పొందినవాడు నిగ్రహుడు. ఇలా మానవుడు తనలోని విభిన్న తత్త్వాలను పరస్పర విరోధాలు కానీయక, ఆంతరిక జీవితాన్ని వ్యవస్థీకరించుకొని తనకు తానే పాలకుడై తన శాసనాలను తానే విధించుకొని ప్రవర్తించిననాడు న్యాయవంతుడవుతాడు. ఆత్మశాంతి పొందుతాడు. విధంగా న్యాయపరమైన ప్రవర్తన కలిగిన వ్యక్తి న్యాయమైన సమాజానికి సమాంతరంగా నడుస్తాడు. వ్యక్తులు న్యాయవంతంగా ప్రవర్తిస్తున్నప్పుడు రాజ్యం న్యాయమార్గంలో నడుస్తుందన్నది నిర్వివాదాంశం.

1.4 తత్త్వజ్ఞులు ఎవరు?
నిత్యము, నిర్వికారము అయిన తత్త్వాన్ని గ్రహించినవారు, జననమరణ వికారశూన్యమైన నిత్యతత్త్వాన్ని చూపే జ్ఞానాన్ని ఎల్లప్పుడూ ప్రేమించేవారు తత్త్వవేత్తలు. సత్యసంధానం వారి మొదటి ప్రేమ. తమ వాంఛలు జ్ఞానాకృష్టాలైనప్పుడు వారు ఆధ్యాత్మికసుఖ విలీనులై శారీరక సుఖాలను లేశమైనా సరకుసేయరు. సునిశిత స్మృతి కలిగినవారు, స్వాభావికంగా వీరికి ఔచితీప్రసాదకలితమైన మనసు ఉంటుంది. ధైర్యం, ఉదాత్తత, గ్రహణశక్తి, ధారణాపాటవం, తత్త్వవేత్తలకు ప్రకృతిసిద్ధ గుణాలు.

లాభకామి మరియు గౌరవ కామికంటే ఏయే జీవితాలు ఎక్కువ సుఖవంతమో జీవితం ఎక్కువ దుఃఖరహితమో తీర్పునివ్వగల ప్రజ్ఞానుభవాలు తత్త్వజ్ఞానికే ఉంటాయి. లాభసుఖ గ్రహణంలో తత్త్వవేత్త పొందిన అనుభవం కంటే ప్రధాన సత్యస్వభావ గ్రహణంలోనూ, జ్ఞానసుఖంలోనూ లాభకామికి తక్కువ అనుభవం ఉంటుంది. కారణం తత్త్వవేత్త బాల్యం నుంచి ఇతర సుఖాలు చవిచూచాడు. కానీ లాభకామికి జ్ఞానమాధుర్యం, సత్యగ్రహణ సౌఖ్యం అనుభూతార్థాలు కావు. అందువలన ఉభయానందం పొందిన తత్త్వవేత్త తీర్పునివ్వటానికి లాభకామికంటే ఎక్కువ అధికారం పొందుతాడు. విధంగా ఇటువంటి నిర్ణయాలలో సత్పదార్థం, జ్ఞానానందం కలిగిన తత్త్వవేత్తకే స్వానుభవం ఎక్కువగా తోడ్పడుతుంది.

దృష్టికి సూర్యతేజస్సులాగా జ్ఞానం వీరి న్యాయప్రవర్తనకు మూలమవుతుంది. కావున తత్త్వజ్ఞుడు సద్గుణపుంజాన్ని ప్రసాదించే విద్యలకు ప్రథమస్థానమిచ్చి తక్కినవాటిని ఉపేక్షిస్తాడు. పాశవికాలయిన అంధసుఖాలకు లొంగడు. జీవితక్రమభంగకారులైన సామాజిక గౌరవాలను, వయష్టిక గౌరవాలను పరిహరిస్తాడు. ఇట్టి లక్షణములు కలవాడే రాజనీతిజ్ఞుడు. ఆదర్శరాజ్యానికి పాలనార్హుడు.

1.5 తత్త్వవేత్తలైన పాలకులను ఎన్నుకోవటం ఎలా?
ఇరవై ఏళ్ళ వయస్సు వరకు పిల్లలందరికీ ఒకే విద్య. శరీర సౌష్ఠవానికి వ్యాయమం, మానసిక సౌష్ఠవానికి సంగీతం అలవాటు చెయ్యాలి. ఆడ, మగ పిల్లలు కలిసి చదువుకోవాలి. ఇరవై ఏళ్ళు వచ్చినంతనే యువతకు పరీక్ష పెట్టాలి. వారి శ్రమసహిష్ణుతను కఠోరంగా పరీక్షించాలి. ఓడిపోయినవారిని ఏరివేసి మూడవ వర్గంగా వివిధ వృత్తులలో స్థిరపరచాలి.

తరువాత మరో పదేళ్ళు ఉన్నత విద్యాభ్యాసం కొనసాగుతుంది. అంకగణితం, రేఖాగణితం మొదలగు శాస్త్రాలు బోధించాలి. అయితే జ్ఞానాన్ని క్రయవిక్రయాదుల కొరకు వణిజులు నేర్చినట్లుకాక ఆత్మోపయోగార్థం నేర్చుకోవాలి. దశ పూర్తికాగానే మళ్ళీ కఠోర పరీక్ష జరుగుతుంది. దానిలో నెగ్గనివారు సైనికులుగా రాజ్య రక్షణ కొరకై నియమింపబడతారు.

రెండో పరీక్షలో నెగ్గినవారు మరో ఐదేళ్ళపాటు శిక్షణ పొందుతారు. ఐదేళ్ళలో యువతీ యువకులకు పారభౌతిక తత్త్వబోధ చేస్తారు. తరువాత వారికి యాభై సంవత్సరాల వయస్సు వరకూ రాజ్యపాలనలో వాస్తవ శిక్షణ ఇవ్వాలి. ప్రజలతో కలిసిమెలసి తిరుగుతూ సమస్త విద్యలలో తమ పరిజ్ఞానం, నైపుణ్యం ఏపాటిదో పరీక్షించుకుంటారు. అప్పుడు తిరిగి పరీక్ష. దీనిలో నెగ్గినవారినే రాజ్యపాలనకు అర్హులుగా నిర్ణయించాలి. వారే ప్లేటో కాంక్షించినఫిలాసఫర్ కింగ్స్”–తత్త్వవేత్తలైన పాలకులు

1.6 ఆదర్శరాజ్యాన్ని పాలించటానికి తత్త్వజ్ఞానులే ఏల అర్హులు?
పై విధంగా ఎన్నుకోబడిన రాజ్యపాలకులు అవినీతిపరులు కారన్న నమ్మకమేమి? తత్త్వజ్ఞానులే రాజ్యపాలకులుగా ఏల అర్హులు? ప్రశ్నలకు సమాధానం అన్నట్లు ప్లేటోగుహదృష్టాంతంఅన్న కథ చెప్తాడు. ఒక గుహలో మానవులు నివసిస్తున్నారనుకో. గుహ ముఖం వెలుగునకు అభిముఖమై నిడివిగా ఉన్నది. శైశవావస్థ నుంచి వారిక్కడే ఉన్నారు. కాళ్ళకు, మెడకు సంకెళ్ళు ఉన్నవి. వాటివల్ల కదలలేరు. ముందుకే చూడగలరు కాని, తలలు వెనకకు త్రిప్పి చూడలేరు. ఎగువన వారికి వెనక కొంతదూరంలో పెద్ద మంట మండుతున్నది. మంటకూ, బందీలకూ నడుమ ఎత్తైన మార్గమున్నది. దానికెదురుగా తోలుబొమ్మలాటవారు తమకూ ప్రేక్షకులకూ నడుమ ఆట చూపటానికి కట్టే తెర వంటి ఎత్తులేని అడ్డుగోడ ఉన్నది. నానావిధ పాత్రలు శిలాదారుమయాలైన జంతువుల బొమ్మలు పట్టుకొని తెరవంటి గోడ వెనుక నడుస్తున్నారనుకో. కొందరు మాట్లాడుతున్నారు. కొందరు మౌనం వహించారు. మంట వెలుగు వల్ల గుహ అడ్డుగోడమీద పడిన తమ నీడలు, పొరుగుల నీడలు మాత్రమే ఖైదీలు చూడగలుగుతారు. నీడలు ఒండొంటితో మాట్లాడుతున్నప్పుడు వాటిని నిజమైన వ్యక్తులు అనుకుంటారు. వారికి అలా ప్రతీకచ్ఛాయలు తప్ప మరొక యదార్ధం తెలియదు.

అలాంటి వారిలోనుంచి ఎవరినన్నా ఒకరిని విడుదల చేసివెలుతురు దిక్కుగా నడవాలి, చూడాలీ’ అని నిర్భంధిస్తే వారు అలా చూడటానికి బాధపడతారు. వెలుగు వారిని బాధిస్తుంది. సమయంలో ఎవడైనానీవిది వరకు చూచినవి ఛాయలు మాత్రమే. ఇప్పుడు మూలవస్తువులకు అభిముఖంగా నడుస్తున్నావు. యదార్థ సత్త కంటపడుతున్నది. ఇప్పుడు నీచూపు స్పష్టతరంఅని అంటే అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? యదార్థతలను చూసి విముక్తుడు దిగ్భ్రాంతుడవుతాడు. అనుభవం పొందిన తరువాత తన అదృష్టానికి సంతోషిస్తూ తన పూర్వ సహచరులపై జాలిపడతాడు. వారిని విడిపించ ప్రయత్నిస్తాడు కూడా. కాని వ్యక్తి మరల గుహలో ప్రతిష్ఠాపితుడైన, అతని కన్నులు ఒక్కసారిగా అంధకారబంధురాలు అవుతాయి. చూపు సరికావటానికి కొంత సమయం పడుతుంది.

చక్షుభ్రాంతి జ్ఞానచక్షువులకు కూడా అన్వయిస్తుంది. ఇది తెలిసినవాడు, “తీవ్ర తేజస్వజీవితంలోనుంచి రావటం వల్ల ఆత్మ చీకటికి అలవాటుపడక చూడలేకపోతున్నదా?” అని విచారిస్తాడు. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తుంచుకోవాలి: దర్శనశక్తి ఉత్పాద్యం కాదు. అది స్వతఃసిద్ధం. అయితే అపమార్గం అనుసరించి అది సత్య విముఖమవుతున్నది. ఇలా అపమార్గం పట్టిన దృష్టిని సరైన విద్యతో త్వరితంగా సన్మార్గానికి మార్చవచ్చు, అంటాడు ప్లేటో. శివదర్శనం పొందినవారు లౌకిక వ్యవహరణకు సమ్మతించరు. “రాజ్యపాలకులుగా, రాజులుగా, ఆత్మపాలకులుగా తయారు చేయటానికే మీకు మిన్నగా విద్యాబుద్ధులు చెప్పించాము. శివసుందరన్యాయాల సత్యస్వరూపాలు మీరు చూశారుఅని చెప్పిన మన శిష్యులు తరుణం వచ్చిన ప్పుడు రాజ్యభారం వహింపక నిరాకరించరు. వారు న్యాయవంతులు. మనం విధిస్తున్న శాసనాలు న్యాయాలు. అందువలన అది విధిగా ఎంచి పదవీ స్వీకారం చేస్తారు. అట్టివారు ఇప్పటి రాజ్యపాలకులు చేస్తున్న ఘోరాలు చెయ్యరు అన్నది ప్లేటో విశ్వాసం, నమ్మకం.

1.7 పాలకవర్గం: జీవితవిధానం
అయినా అంతటితో ఆగక, ఆదర్శరాజ్య లక్ష్యసాధనకై పాలక వర్గపు జీవిత విధానాన్ని ప్లేటో ఇలా నిర్వచిస్తాడు: రాజ్యపాలకులకు ఆవశ్యకతకు మించిన ఆస్తిపాస్తులుండరాదు. స్వంతంగా ఇల్లుగానీ, భాండాగారంగానీ ఉండకూడదు. నిగ్రహం మరియు ధైర్యం కలిగిన యోధులకు కావలసిన యోగ్యవస్తుసామగ్రి మాత్రమే పౌరులనుంచి స్వీకరించాలి. ఊరు శివార్లలో నివసించే సైనికులవలె పాలకులు కలిసిమెలసి ఉండాలి. వీరు బంగారముగానీ, వెండిగానీ ముట్టరాదు మరియు ధరించరాదు. ఆయురారోగ్యాలకు అవసరమైన సాధారణ ఆహారం మాత్రమే తీసుకోవాలి. వీరికి స్వంత కుటుంబాలు ఉండకూడదు. స్వీయభార్యలంటూ కూడా ఉండరాదు. వర్గపు స్త్రీలందరూ పాలకవర్గపు పురుషులందరికీ భార్యలే. వారికి జన్మించే పిల్లలు అందరికీ పిల్లలే. ఎవరు ఎవరి సంతానమో తెలియకుండా వారిని రాజ్యమే వేరుగా పెంచాలి. విధంగా స్వీయ కుటుంబాలు లేనిపాలకులకు ధనవ్యామోహం ఉండదు, కావున న్యాయం సవ్యంగా సాగుతుంది అన్నది ఆశ.

1.8 ఆదర్శరాజ్యం: ఏల ఉన్నతం?
విధంగా తాము నిర్మించదలచిన ఆదర్శరాజ్యంఉత్తమమైనదనీ, న్యాయపరమైనదనీ, కారణంగా అది గరిష్ఠ సుఖసంతోషాలను అందిస్తుంది అని రుజువు చేయడానికై ఆదర్శరాజ్యాన్ని ఆనాటివరకూ ప్రాచుర్యంలో ఉన్న అన్య రాజ్యాంగ విధానాలైనట్రిమోక్రాటియాప్రభుత్వం, ధనికవర్గీయ ప్రభుత్వం, ప్రజాస్వామ్యం మరియు కడపటిదైన నిరంకుశ ప్రభుత్వం, వాటిద్వారా ఉపలబ్ధమవుతున్న న్యాయాన్యాయాలతో తులనాత్మక చర్చకూడా చేస్తాడు.

ట్రిమొక్రాటియాప్రభుత్వంలోని పాలకులు ధన ప్రలోభులు. తమ కోర్కెలను ఇతరుల డబ్బుతో తీర్చుకుంటారు. సాత్వికంగా కాక నిర్బంధంతో శిక్షణ పొందుతారు. ఇందు స్పర్థాతృష్ణల ప్రాబల్యం మెండు. తత్వజ్ఞులకు తావివ్వదు. నిరంతర యుద్ధ నిర్వహణకు ప్రాముఖ్యం ఇస్తుంది. కావున ప్రజలకు సుఖసంతోషాలు తక్కువ. ధనిక వర్గీయ ప్రభుత్వానికి సంపదల యందు, సంపన్నులయందు అభిమానగౌరవాలు మెండు. కావున గుణసంపత్తి మరియు గుణవంతుల యందు గౌరవం సన్నగిల్లుతుంది. సంపత్తినిబట్టి పదవులు. విధంగా రాజ్యం రెండుగా చీలుతుంది: ధనికుల రాజ్యం, పేదల రాజ్యం. ప్రాజాస్వామ్యంలో అత్యంత మనోజ్ఞమైనది స్వాతంత్రయం. దానితో ప్రజలు ఎటువంటి నియమాలనూ పాటించరు. తుదకు చట్టాలను కూడా లక్ష్యం చేయరు. ఎవరి అధికారాన్నీ చలాయించనీయరు. విధంగా అది ఘోరతమ అవ్యవస్థాకలితం అవుతుంది. కడపటిదైన నిరంకుశ ప్రభుత్వంలో రాజ్యం దాస్యమనుభవిస్తుంది. నియంత తన పాలనత్వం దక్కించుకోవటానికి ప్రయోజనుడైన ప్రతివానినీమిత్రుడైనా, శత్రువైనాతొలగించును. స్వచ్ఛంద కర్మ ప్రవృత్తి కాజాలదు. కావున నియంత పాలనకు లోనైన రాజ్యంలో ఏడ్పులు, పెడబొబ్బలు, మూల్గులు మెండుగా వినిపిస్తాయి.

శివసుందరన్యాయాల సత్యస్వరూపాలను వీక్షించిన ఆదర్శరాజ్యంలోని తత్త్వజ్ఞులు నిరీహూలై పాలిస్తారు గావున పై నుదహరించిన అన్యాయాలు, ఘోరాల స్థానంలో జ్ఞానము, ధైర్యము, నిగ్రహము మరియు న్యాయము తాండవిస్తుంది. కాబట్టి సుఖం రాజ్యమంతా వ్యాపిస్తుంది.

1.9 కవుల బహిష్కరణ
ఈశ్వరుడు పరమ సుందరుడు, ఉత్తమోత్తమ రూపుడు అని ఊహిస్తున్నాము. అట్టి ఈశ్వరుడు మానవజాతిని వంచించడు. కానీ ఈశ్వరుని గురించి కవులు హాస్యాస్పదంగా వ్రాశారు. దేవతలను నీతిబాహ్యమైనవారిగా కూడా వర్ణించారు. “దేవతలను కూడా వారి లక్ష్యాలనుంచి మార్చవచ్చును. ధర్మం ఉల్లంఘించి పాపం ఒడిగట్టిన మానవులు దేవతలను ప్రార్థించి బలులతో, దీనాభ్యర్థనలతో, సోమరసాదానాలతో మాంసగంధాలతో వారి కోపాన్ని పరిహరించవచ్చునుఅంటూ హోమర్ అంతటి కవి రాస్తున్నాడు. ఇదేవిధంగా కవులు మానవుల విషయంలో కూడా ఘోరతర అసత్యాలు రాశారు. ఉదాహరణకు న్యాయహీనులు ఆనందంగానూ, న్యాయబద్ధులు దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నట్టుగానూ వర్ణిస్తారు. ఇట్టివి విన్నప్పుడు పసిపాపల మనస్సులు ఎలా పరిణమిస్తవో ఒకసారి ఆలోచించమంటాడు ప్లేటో.

మన రాజ్యంలోని యువత ఆబాల్యమంతా ధీరులు, నిగ్రహవంతులు, పవిత్రులు, స్వతంత్రులు మున్నగువారినే అనుకరించ వలెనే కానీ ఏవిధమైన నీచత్వాన్నిగానీ, సంకుచితత్వాన్నీ గానీ అనుకరించరాదు. అప్పుడే వారు న్యాయవంతులవుతారు. కావున ఈశ్వరస్తవాలు, మహాపురుషుల స్తోత్రాలు తప్ప మరే కవిత్వాన్నీ మన రాజ్యంలో ప్రవేశించనీయరాదన్నది మన సంకల్పం అంటాడు ప్లేటో.

అనుకరణాత్మక కవిత్వం నిశ్చింతగా ఆదరణీయం కాదు. హోమర్ రచనల పట్ల అపారమైన ఆదరము, మక్కువ గౌరవం కూడా. కానీ సత్యం కంటే మానవుడెన్నడూ ఉపాస్యతరుడు కాడుఅంటూ కవులను ప్లేటో ఆదర్శరాజ్యం నుంచి అనూహ్యంగా బహిష్కరిస్తాడు. “ఆత్మ అమర్త్యమని... గుర్తించి నిరంతరం ఊర్థ్వగమనమనుసరిస్తూ ఎల్లప్పుడూ న్యాయాన్ని సద్గుణసంపత్తినీ పాలించాలి...” అని ఉపదేశిస్తూ తన గ్రంథాన్ని ముగిస్తాడు.

2. కృష్ణారావుగారి అనువాదశైలి: లోతుపాతుల పరిశీలన
అసిధారావ్రతంగా సాగించిన కృష్ణారావుగారి అనువాద శైలి గురించి అర్ధవంతమైన అభిప్రాయానికి రావాలన్న ముందుగా మనం అనువాద సంబంధిత సిద్ధాంతాల గురించి చెప్పుకోవటం ఉచితం. మూల్యంలో ఎలా ఉందో అలానే చెప్పటం అనువాదకుడి ప్రథమధర్మంపాఠకుడికి హాయిగా సాగే అనువాదం ఇవ్వాలన్న ఉబలాటంలో స్వేఛ్ఛారీతిలో అనువదించ కూడదు; అలా అని అతివినయం చూపే రీతిలోనూ సాగకూడదు; మరియు చెప్పదలచుకున్న సిద్ధాంతాన్ని బలహీనపరిచే తత్వం గల డొంకతిరుగుడు ప్రసంగం, విస్తరణ వగైరాలకు తావివ్వకూడదు. అలా అని మరీ మాటకిమాట తర్జుమా చేసి చెప్పదలచుకున్న భావాన్ని హీనపరచకూడదు.

స్థూలంగా శాస్త్రజ్ఞుల దృష్టిలో ఆదర్శవంతమైన అనువాదం విధంగా ఉండాలి:
  •  నిర్ధిష్ఠంగా: మూలగ్రంథంలో వెలిబుచ్చిన భావాలను యథాతథంగా అనువదిస్తున్న భాషలో చెప్పాలి.
  •  సహజంగా: చెప్పే మూల గ్రంథంలోని ప్రతి భావాన్ని అనువాద భాషలోని సహజసిద్ధమైన మాటలతో వెలిబుచ్చాలి. మరియు మాటలు మూలగ్రంథంలో చర్చిస్తున్న శాస్త్రజ్ఞానానికి తగినట్లుగా ఉండాలి.
  •  తెలియపరచునదిగా: తెలియచెప్తున్న భావాలని, వాటి అర్థాల్ని చదివినంతనే సులువుగా అర్థమయ్యే రీతిలో అభివ్యక్తీ కరించటమే ఫలవంతమైన అనువాదం.
ధర్మసూత్రాల ఆధారంగాఆదర్శరాజ్యంఅనువాదాన్ని పరిశీలిద్దాం.

2.1 నిర్దిష్ఠత
అనువాదంలో జీవికె గారు ఎక్కడా భావననీ స్వేచ్ఛారీతిలో అనువదించలేదు. చర్చిస్తున్న తాత్త్విక విషయాల భావగంభీరతను దృష్టిలో ఉంచుకొని వాటిని యథాతథంగా సముచిత పదజాలంతో తెలియచెప్పారు. అలా నిర్దిష్ఠతను విడువకుండానే మూలంలోని భావనను తెలుగు పాఠకుడి దరిచేర్చటానికై మూలభావానికి అనువైన ప్రాంతీయ ఆచార వ్యవహారాలను ఊటంకిస్తూ తమ అనువాదాన్ని సాగించారు. ఉదాహరణకు, క్రింది పేరా ఎలా అనువదించబడిందో పరిశీలించిన నిర్దిష్టత కొరకు అనువాదకుడి తపన స్పష్టమవుతుంది.

జోవిట్ ఆంగ్లమూలం: “And therefore when any one of these pantomimic gentlemen, who are so clever that they can imitate anything, comes to us, and makes a proposal to exhibit himself and his poetry, we will fall down and worship him as a sweet and holy and wonderful being; but we must also inform him that in our State such as he are not permitted to exist; the law will not allow them. And so when we have anointed him with myrrh, and set a garland of wool upon his head, we shall send him away to another city. For we mean to employ for our souls’ health the rougher and severer poet or story-teller, who will imitate the style of the virtuous only, and will follow those models which we prescribed at first when we began the education of our soldiers” (Book-III).

దీని తెలుగు అనువాదం  ఇలా నడుస్తుంది: కాబట్టి దేనికైనా అనుకరించగల నటన మహాశయుడు మనదగ్గరకు వచ్చి తను, తన విద్యను ప్రదర్శించగోరితే, “మీరు మధురమూర్తులు, పవిత్రులు, విభ్రాంతికారులు” అని అతనికి ప్రణామమర్పించి పూజాసత్కారాలు చేసి, “మీవంటివారికి మా రాజ్యం యోగ్యంకాదు. చట్టం మీ ఉనికికి సమ్మతించదు” అని చెప్పాలి. అతనికి చందన తాంబూలాలిచ్చి దోసెడు పూలు నెత్తినపోసి మరొక రాజ్యానికి అతన్ని పంపివేయాలి. ఎందుకంటే రక్షకుల విద్యావిధాన నిర్ణయ సంధర్భంలో మన లక్ష్యాలేవో నిర్ణయించుకొన్నాము. లక్ష్యాల సాధనకై సత్పురుషుల వృత్తిభంగినే అసిధారావ్రతియై అనుకరించే కవిని లేదా కథకుని మాత్రమే మనం వినియోగింప సంకల్పిస్తున్నాము” (ఆదర్శరాజ్యం, పేజీ 119).

2.2 సహజత్వం
ముందుగా చెప్పుకున్నట్లు ప్లేటో రచన ఆసాంతం సంభాషణలుగా నడుస్తుంది. సంభాషణలలోనే గంభీరమైన తాత్త్విక విశ్లేషణ కొనసాగుతుంది. విజాతీయమైన మరియు తాత్త్వికపరమైన సంభాషణలను మూలభావం చెడకుండా తెలుగు భాషలో ఇద్దరు తెలుగు పండితులు మాట్లాడుకుంటున్నట్లు చిత్రిస్తారు. ఉదాహరణకు, క్రింది సంభాషణను పరిశీలించిన అనువాదకుడి రచనా చాతుర్యం అవగతమవుతుంది.

And which are the harmonies expressive of sorrow? You are musical, and can tell me.
నీకు సంగీతపరిజ్ఞానం ఉన్నది. కాబట్టి రాగాలలో ఏవి కరుణవ్యంజకాలో నీవే చెప్పాలి.

The harmonies which you mean are the mixed or tenor Lydian, and the full-toned or bass Lydian, and such like.
మీరు కోరుతున్న ఫలమంజరి, భూపాలరాగం, సింహేంద్రమధ్యమ మున్నైనవి.

These then, I said, must be banished; even to women who have a character to maintain
they are of no use, and much less to men. Certainly.
అయితే వీటిని బహిష్కరించాలి. శీలం రక్షించుకోవలసిన స్త్రీలకైనా పనికిరావన్నప్పుడు పురుషులకు అంతకన్నా పనికిరావని వేరే చెప్పాలా?

In the next place, drunkenness and softness and indolence are utterly unbecoming the
character of our guardians.
మదిరావివశత్వం, కోమలత్వం, లాలసత్వం పాలకుల శీలానికి మాత్రం యోగ్యాలు కావు.

Utterly unbecoming.
నిజమే!

And which are the soft or drinking harmonies?
వివశత్వాదికం రేకెత్తించే రాగాలెవ్వి?

The Ionian, he replied, and the Lydian; they are termed ‘relaxed.’
కళ్యాణి (?) మున్నైనవి.

Well, and are these of any military use?
మరి ఇవి సైనికంగా అణుమాత్రమైనా ఉపయోగపడుతవా?

Quite the reverse, he replied; and if so the Dorian and the Phrygian are the only ones
which you have left (Book-III).
లేదు. మీదు మిక్కిలి విరుద్ధాలు. వీటిని కూడా తీసివేస్తే మిగిలేవి నాట, శ్రీరాగాదులు (?) మాత్రమేనని అతడన్నాడు (ఆదర్శరాజ్యం, పేజీ 120-121).

2.3 కమ్యూనికేటివ్ స్ట్యైల్
మూలగ్రంథంలో తెలియజేసిన తర్కపరమైన తాత్త్విక జ్ఞానాన్ని అనువదిస్తూ కూడా ఎక్కడా తన ముఖ్య ఉద్దేశాలైన: ఒకటి చదవటం సుఖంగా సాగాలి; రెండు చదివినంతనే చదివినది ఎంత గంభీర విషయమైనా తేలికగా అర్థం కావాలి అన్న తపనను విస్మరించక తన భాషాజ్ఞానంతో వాక్యనిర్మాణ నైపుణ్యంతో అనువాద గ్రంథం ఆసాంతం చదవగలిగినదిగా మరియు చదివినంతనే తేలికగా అర్థమయ్యే రీతిలో అనువాదాన్ని సాగించారు. క్రింది పేరాలను చదివిన వీరి ఆరాటం మరియు దాని సఫలత తేటతెల్లమవుతుంది.

And therefore, I said, Glaucon, musical training is a more potent instrument than any other, because rhythm and harmony find their way into the inward places of the soul, on which they mightily fasten, imparting grace, and making the soul of him who is rightly educated graceful, or of him who is ill-educated ungraceful; and also because he who has received this true education of the inner being will most shrewdly perceive omissions or faults in art and nature, and with a true taste, while he praises and rejoices over and receives into his soul the good, and becomes noble and good, he will justly blame and hate the bad, now in the days of his youth, even before he is able to know the reason why; and when reason comes he will recognize and salute the friend with whom his education has made him long familiar (Book-III).
గ్లాకన్! ఇతర సాధనాలన్నిటికంటే సంగీతసాహిత్య శిక్షణ అత్యంత శక్తిమంతం. ఎందుకంటే రాగతాళాలు, గుణరీతులు ఆత్మయొక్క అంతరాంతరాలలో ప్రవేశించి దానిని రమణీయం చేస్తవి. వీని వైపరీత్యం ఆత్మను వికృతం చేస్తవి. ఉత్తమమైన విద్యను పొందినవాడు కళలోను, ప్రకృతిలోను ఉన్న లోపాలను, దోషాలను నిశితబుద్ధితో కనుగొంటాడు. సమ్యగభిరుచి గలిగి శివంకరాన్ని మెచ్చుకుంటాడు; ఆనందిస్తాడు; గ్రహిస్తాడు. గ్రహించి ఉదాత్తుడవుతాడు. చెడుగును చూచి చికాకుపడతాడు; ఏవగించుకుంటాడు. ఇదంతా కారణం ఎరుగజాలని పిన్నతనంలోనే జరిగిపోతుంది. వివేకవంతుడైన పిమ్మట అట్టి విద్యను బోధించి శివంకరంతో ఆబాల్య పరిచయం కల్పించిన గురువును గుర్తించి నమస్కరిస్తాడు (ఆదర్శ రాజ్యం, పేజీ 126).

అనువాదంలో గల అందాన్ని గ్రహించటానికి / ఆస్వాదించటానికిగాను మరో ఉదాహరణగా పుస్తకం ఆఖరి పేరాను పరిశీలించగలరు:
And thus, Glaucon, the tale has been saved and has not perished, and will save us if we are obedient to the word spoken; and we shall pass safely over the river of Forgetfulness and our soul will not be defiled. Wherefore my counsel is that we hold fast ever to the heavenly way and follow after justice and virtue always, considering that the soul is immortal and able to endure every sort of good and every sort of evil. Thus shall we live dear to one another and to the gods, both while remaining here and when, like conquerors in the games who go round to gather gifts, we receive our reward. And it shall be well with us both in this life and in the pilgrimage of a thousand years which we have been describing (Book-X).
గ్లాకన్! విధంగా మనకీ కథ నశించక దక్కింది. ఉపదేశాన్ని శిరసావహిస్తే, ఇది మనలను కాపాడుతుంది. మనం సురక్షితంగా అపసారికా నదిని దాటుతాము. మన ఆత్మలు కలుషితాలు కావు. కాబట్టి నా ఉపదేశం ఒకటే. ఆత్మ అమర్త్యమనీ, ఎలాంటి పాపపుణ్యాలైనా సహించగలదనీ, గుర్తించి నిరంతరం ఊర్థ్వగమనమనుసరిస్తూ ఎల్లప్పుడూ న్యాయాన్ని, సద్గుణ సంపత్తినీ పాలించాలి. విధంగా ఐహికజీవితమందు క్రీడావిజేతల వలె బహుకృతి పొందేటప్పుడు మనం ఒండొరులకేమి, దేవతలకేమి ప్రీతిపాత్రులమై జీవించాలి. జీవితంలోనూ, ఉత్తరసహస్రవర్ష యాత్రలోనూ మనకు కళ్యాణమగుగాక! (ఆదర్శరాజ్యం, పేజీ 474).

ముగింపు
"అనువాదకుడి మొదటి మరియు చివరి కర్తవ్యం మూల గ్రంథానికి నిష్ఠాగరిష్ఠుడై ఉండుటే, అప్పుడే అతడు గ్రంథం యొక్క ఆత్మను గౌరవించినవాడిగా గుర్తింపబడగలడు" అన్న విశ్వనాథంగారి సూత్రానికి కట్టుబడినవాడై ప్లేటో భావాలను, ఆయన తాత్త్వికాలొచనలను, ఆదర్శరాజ్య లక్ష్యాలను, అది సాధించటానికి ఆచరించవలసిన పద్ధతులను, తెలుగు పాఠకులకు సృజనాత్మకతాపూరమైన సంభాషణలతో తెలియచెప్పటమొక్కటే తన ఉద్దేశ్యమన్నట్లు కాక, పాఠకుడి మనస్సులో సదృశభావావేశపూరిత స్పందనను ఆవాహన చేయటానికి కూడా కృష్ణరావుగారు ప్రయత్నించారన్నది నిస్సందేహం. అనువాదపరిమళాన్ని పాఠకుడికి అందించాలన్న దృష్టితో వ్యాసం ప్రథమ భాగంలో (1.1 నుంచి 1.9 వరకు) ఎక్కువగా అనువాదకుని వాక్యాలనే వాడటం జరిగింది.

అనువాదకుడు తలంచినట్లు ప్లేటోశాస్త్రమ్మును గావ్యముంగలసి హిందోళంబునం బాడగా” అవతరించినరిపబ్లిక్గ్రంథాన్ని కృష్ణరావుగారుఅసిధారావ్రతంనెరపి ఆంధ్రీకరించి తెలుగు పాఠకులకు అందించినఆదర్శరాజ్యంకూడా హాయిగా, ‘మోహనరాగంలా సాగిందనుటలో’ కొంతైనా సత్యం లేకపోలేదని గ్రంథ పాఠకులకుపొడకట్టకమానదు'. అనుషంగికంగా ఇక్కడో మాట చెప్పుకోవాలి: కృష్ణారావుగారు 1958లో అనువదించినవిగ్రహవ్యావర్తనీ’ అను జాతీయ గ్రంథానికీ, 1961లో అనువదించినరిపబ్లిక్అనువాదానికి ఎంత వ్యత్యాసమో! రెండూ దర్శనశాస్త్రాలే. అయినా మొదటిది అర్థంచేసుకోవటమే కాదు, పాఠకుడికి చదవటం కూడా కష్టతరమే! రెండవది చదవటానికేకాదు అర్థంచేసుకోవటానికి కూడా సులువే! ఒక్క మాటలో చెప్పాలంటేఆదర్శరాజ్యంచదువుతున్న పాఠకుడికి వాళ్ళ ఊళ్ళోని గుడిలో పండితుడి భాష్యం వింటున్నట్టే అనిపిస్తుంది కాని విజాతీయ సంస్కృతి గురించో లేక విదేశీయుడో బోధిస్తున్న సిద్ధాంతాలనో చదువుతున్నట్టు అనిపించదు. అందుకే కృష్ణరావుగారిఆదర్శరాజ్యంఅనువాదానికే ఆదర్శమనుటలో అతిశయోక్తిలేదు.

మూడు సంవత్సరాలలో వీరి అనువాదశైలిలో ప్రతిబింబించిన మార్పు పాఠకులకు ఆశ్చర్యం కలిగించటం స్వాభావికం. మార్పు మూలగ్రంథాల ప్రమేయమా? లేకశ్రాంతు’ల కోవకు చెందినట్లు చెప్పబడే కృష్ణరావుగారి నిరంతరాన్వేషణలో భాగమా? ఇదమిత్థంగా చెప్పటం కష్టం. కారణం విగ్రహవ్యావర్తనికారిక సమాహారం; రిపబ్లిక్ సంభాషణల తోరణం.

కృష్ణరావుగారి సాహిత్యంతో అంతో ఇంతో పరిచయం ఉన్న పాఠకుడికి మరో భావన కూడా కలగకపోదు: “ఈయన ప్లేటో పుస్తకంతో ఎంతగా తాదాత్మ్యం చెంది అనువదించారోకదా!” ఉదాహరణకు వాక్యం చూడండి: “అయినా న్యాయవిషయంలో నోటపలుకు, ముక్కున ఊపిరి ఉండగా నేను సహాయం నిరాకరించలేను. న్యాయం దూషణకు పాల్పడుతుంటే చెవులారా వింటూ ఉపేక్షించటం మహాపాతకం. కాబట్టి చేతనైనంతవరకు తోడ్పడటం నా కర్తవ్యం” (పేజీ 69). వాక్యాలు చదువుతుంటే ఇవి ఎక్కడో గ్రీస్ లో ఎవరో చెప్పిన మాటలకు–“And yet I cannot refuse to help, while breath and speech remain to me; I am afraid that there would be an impiety in being present when justice is evil spoken of and not lifting up a hand in her defence. And therefore I had best give such help as I can.”–తర్జుమా అనిపించదు, స్వతహాగా తెలుగులో పలికిన పలుకుల్లాగా హృదయంలో హత్తుకుపోతుంది. ఇక ఇందులోనివర్సెస్అనువాదం పరిశీలిస్తే “... mothers under the influence of the poets scaring their children with a bad version of these myths–telling how certain gods, as they say, ‘Go about by night in the likeness of so many strangers and in divers forms’ ...”  భావన ఇంకా దృఢపడుతుంది. ఉదాహరణకు దీనిని పరిశీలించండి: “నిదురపోవయ్య నాతండ్రి నిదురపొమ్ము / నిన్నుగొనిపోవ నీరేయి ఎన్నో మాయ / రూపులెత్తి నగరంపుఁ ద్రోవలందు / తక్కి తారుచున్నది దేవతాచయమ్ము” (పేజీ 93). చక్కని పదాలు ఏర్చి ఎన్ని పద్యాలు / కవితలు కూర్చారో!

విధంగా కృష్ణరావుగారి నూతన అనువాదశైలి పాఠకుడికి సులభగ్రాహ్యమైనరిపబ్లిక్ని అందించింది. కానీ పుస్తక ప్రతులు గత రెండు మూడు దశాబ్దాలుగా అందుబాటులో లేవు. సాహిత్య అకాడమికానీ మరెవరైనాకానీ దీనిని పునర్ముద్రించటం ఆవశ్యకం.


**

6 comments:

  1. ఈ పుస్తకం online లో లేదు కదా...ఎక్కడ దొరుకుతుంది. Plz informetion ఇవ్వండి

    ReplyDelete
  2. Replies
    1. It's really badluck it is not available now a days anywhere.The loosers are Telugu people.pl.somebody who have a copy can mail me.

      Delete
    2. Its really yes sir

      Delete
  3. Where can I buy this book?

    ReplyDelete
  4. Internet archive లో బుక్ పెట్టవచ్చు కదా

    ReplyDelete

Recent Posts

Recent Posts Widget